ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రతి బూత్ పరిధిలోనూ దొంగ ఓట్లను ఏరిపారేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) పిలుపునిచ్చారు. బుధవారం సీతాఫల్‌మండిలో జరిగిన సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే టి. పద్మారావు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ సలీం, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక నిరంతర సవరణ (SIR), పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై కేటీఆర్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చూపిస్తూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో 95 లక్షలు, బీహార్‌లో 65 లక్షల ఓట్లను అక్రమంగా తొలగించడం వల్లే అక్కడ విపక్షాలు నష్టపోయాయని గుర్తుచేశారు. తెలంగాణలోనూ ఇటువంటి అక్రమాలు జరగకుండా బూత్ లెవెల్ ఏజెంట్లు (BLA) సైనికుల్లా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ‘కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే వాతావరణం ఉందని, దాన్ని ఓట్ల రూపంలో మార్చాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు.
ఎస్ఐఆర్ (Special Intensive Revision) అనేది ఓటర్ల జాబితాను జల్లడ పట్టే వడపోత కార్యక్రమమని కేటీఆర్ వివరించారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ అధికారులు (BLO) ఇంటింటికీ వస్తారని, ఈ సమయంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చూడాలన్నారు. చనిపోయిన వారి ఓట్లను తొలగించడం, ఇళ్లు మారిన వారి వివరాలను సవరించడం వంటి ఐదు రకాల బాధ్యతలను ఏజెంట్లు సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అక్టోబర్ 1న వెలువడే తుది జాబితాయే రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కీలకం కానుందని స్పష్టం చేశారు.
గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన ఓట్ల అక్రమాలను కేటీఆర్ ప్రస్తావించారు. ఒకే ఓటరుకు ఐదు వేర్వేరు నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్న ఉదాహరణలను స్క్రీన్‌పై ప్రదర్శించారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇటువంటి అనుమానాస్పద ఓట్ల జాబితాను పార్టీ తరఫున ‘వర్క్ బుక్’ రూపంలో ప్రతి ఏజెంట్‌కు అందజేస్తామని, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు.
ALso Read:ఫామ్ 16 లేకుండా ఐటీ ఫైల్ చేయవచ్చా?
ఇదే నెలలో ప్రారంభం కానున్న పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో, సరికొత్త మొబైల్ యాప్ ద్వారా చేపట్టనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కేవలం ఫోన్ నెంబర్, ఫోటో అప్‌లోడ్ చేస్తే ఓటర్ ఐడీ ఆధారంగా వివరాలన్నీ ఆటోమేటిక్‌గా నమోదవుతాయన్నారు. సికింద్రాబాద్‌లో ప్రతి కార్యకర్తకూ బ్రహ్మాండమైన ఫోటో ఐడీ కార్డులు అందించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

