రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి ఎద్దడి, కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ల నిర్వహణపై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ కక్షలతో రైతుల పొలాలను ఎండబెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు.
రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక కరవు ఛాయలు కనిపిస్తున్నా, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల విలువైన నీరు వృథాగా పోతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ప్రస్తుతం లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి కొట్టుకుపోతోందని ఆయన గుర్తు చేశారు.
“రేవంత్ రెడ్డి.. నీకు మా మీద కోపం ఉంటే మాపై కేసులు పెట్టుకో.. అంతేకానీ అన్నదాతలపై పగ తీర్చుకోకు. నీళ్లున్నా వాడుకోకుండా రైతులను ఇబ్బంది పెట్టడం ఏంటి?” అని కేటీఆర్ ప్రశ్నించారు.కరువు కాలంలోనూ తెలంగాణ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. వర్షాలు పడకపోయినా గోదావరి నదిలో ఎల్లప్పుడూ నీళ్లుండే ఖచ్చితమైన ప్రాంతాన్ని గుర్తించి, శాస్త్రీయంగా పరిశోధనలు చేసిన తర్వాతే కేసీఆర్ అక్కడ ప్రాజెక్టు నిర్మించారని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఉన్న నీటి లభ్యతను బట్టి కన్నెపల్లి ప్రాజెక్టులోని కేవలం రెండు పంపులను ఆన్ చేసినా కాళేశ్వరం ద్వారా తెలంగాణ అంతటా నీళ్లు పారి, రాష్ట్రం మళ్లీ సుభిక్షమవుతుందని కేటీఆర్ తెలిపారు. ఇంత స్పష్టమైన అవకాశం ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే మోటార్లు ఆన్ చేయడం లేదని, గత ప్రభుత్వంపై ఉన్న రాజకీయ పగతోనే ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వెంటనే పంపులను ప్రారంభించి ఎండిపోతున్న పంటలను కాపాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Also Read:ఇండోనేషియాకు ప్రధాని మోదీ

