ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఫామ్‌హౌస్, దళిత సంక్షేమం, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ధీటైన సమాధానమిచ్చారు.
మొన్నటిదాకా నీ కంపు నోరుతో కేసీఆర్ ఫామ్‌హౌస్ 1,000 ఎకరాలు అని ప్రచారం చేశావు. మరి ఈరోజు నువ్వే స్వయంగా కేసీఆర్ గారికి 67 ఎకరాలే ఉందని ఎలా చెప్తున్నావు? అని కేటీఆర్ నిలదీశారు. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లోనే ఆ 67 ఎకరాల వివరాలను స్పష్టంగా పేర్కొన్నారని, ఇందులో రేవంత్ రెడ్డి కొత్తగా కనిపెట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఒక రైతుగా చట్టబద్ధంగా భూమి కొనుగోలు చేశారని, ఆయన భూమిని దేవతలా పూజిస్తారు తప్ప.. రేవంత్ రెడ్డిలా పరుల ఆస్తులు లాక్కొని భూములను ఆటవస్తువుగా చూడరని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రగతి భవన్‌లో 150 బెడ్ రూమ్‌లు, బంగారు బాత్రూమ్‌లు ఉన్నాయని చిల్లర వ్యాఖ్యలు చేశారని, నిన్న ఆయన చేసిన ఆరోపణలు కూడా అంతే నిజమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. “ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయన్నది ఎంత నిజమో.. రేవంత్ రెడ్డి మాటలు కూడా అంతే నిజం. మైసూరు బోండాలో ఎంత మైసూర్ ఉంటుందో, ఆయన మాట్లాడిన మాటల్లోనూ అంతే నిజం ఉంది” అని సెటైర్లు వేశారు.
రేవంత్ రెడ్డి దళితులపై నకిలీ ప్రేమను కురిపిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఆయన ఎమోషనల్ అయి మాట్లాడటం చూస్తే.. మల్లు భట్టి విక్రమార్కనో లేదా విద్యాసాగర్ రావునో సీఎం చేస్తారేమో అనుకున్నాను. అంత ప్రేమ ఉంటే ఎన్నికల్లో హామీ ఇచ్చిన దళిత డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లను వెంటనే అమలు చేయాలి. కేసీఆర్ రూ.10 లక్షల దళిత బంధు ఇస్తే, తాము రూ.12 లక్షలు ఇస్తామని చెప్పారు కదా.. మరి ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్‌పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:మోదీ@76..ప్రముఖుల విషెస్

