కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న భూదందాలకు రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి హిల్ట్ పాలసీ స్కామ్‌లో భూములు కొనుగోలు చేసే పారిశ్రామికవేత్తలు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి బీఆర్ఎస్లో చేరగా… కేటీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న భూదందాలన్నింటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత చెక్ పెడతామని స్పష్టం చేశారు.
మియాపూర్‌లోని 550 ఎకరాల భూముల విషయంలోనూ కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ భూములను విక్రయిస్తానని ముఖ్యమంత్రి చెబుతున్నారని, వాటిని అమ్మడం కంటే ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు. అందులో 200 ఎకరాలను పేదలకు ఇళ్ల నిర్మాణానికి, 100 ఎకరాలను అమరవీరుల స్మారక కార్యక్రమాలకు, మరో 100 ఎకరాలను తెలంగాణ ఉద్యమకారులకు కేటాయించాలని కోరారు. మిగిలిన భూముల్లో పిల్లల కోసం పాఠశాలలు, కళాశాలలు నిర్మించాలని సూచించారు. ప్రభుత్వం ఈ విధంగా చేస్తే తాము గొప్పగా స్వాగతిస్తామని అన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మియాపూర్ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరిగినప్పుడు బీఆర్ఎస్ తరఫున ప్రముఖ న్యాయవాదిని నియమించి న్యాయపోరాటం చేశామని కేటీఆర్ గుర్తుచేశారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆ భూములు ప్రభుత్వానికి చెందినవేనని తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే తీర్పు వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి ఆ భూములను విక్రయిస్తామని ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి తీరును విమర్శిస్తూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అడవులను నరికే వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిగా నియమిస్తే ఎలా ఉంటుందో.. భూములను విక్రయించే బ్రోకర్‌ను ముఖ్యమంత్రిని చేసినట్లుగా రేవంత్ రెడ్డి పాలన ఉందంటూ విమర్శించారు. రాష్ట్ర ప్రజల ఆస్తులుగా ఉన్న భూములను విక్రయించకుండా ప్రజల సంక్షేమం, భవిష్యత్ తరాల అవసరాలకు ఉపయోగించాలని డిమాండ్ చేశారు.

