USA:ట్రంప్‌కు గట్టి షాక్

2
- Advertisement -

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాలుగా రిపబ్లికన్ల ఆధిపత్యంలో ఉన్న నాలుగు కీలక రాష్ట్రాల్లో డెమోక్రటిక్ పార్టీ చారిత్రక విజయాలు నమోదు చేసింది. ఒహియో, అయోవా, జార్జియా, టెక్సాస్ రాష్ట్రాల్లో డెమోక్రటిక్ అభ్యర్థులు విజయం సాధించి రిపబ్లికన్ల ఆధిపత్యానికి తెరదించారు. ఒహియో, అయోవాలో 20 ఏళ్ల తర్వాత, జార్జియాలో 28 ఏళ్ల తర్వాత, టెక్సాస్‌లో 36 ఏళ్ల తర్వాత డెమోక్రాట్లు గవర్నర్ పదవులను కైవసం చేసుకున్నారు. ఈ ఫలితాలు ట్రంప్ రాజకీయ ప్రభావానికి గట్టి పరీక్షగా మారాయి. దేశంలో పెరుగుతున్న ధరలు, ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి ఈ ఫలితాల్లో ప్రతిబింబించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒహియోలో డెమోక్రటిక్ అభ్యర్థి, వైద్యురాలు డాక్టర్ అమీ ఆక్టన్… రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామిపై విజయం సాధించారు. 60 ఏళ్ల అమీ ఆక్టన్‌కు 51 శాతానికి పైగా ఓట్లు రాగా, రామస్వామికి 45 శాతానికి పైగా ఓట్లు లభించాయి. ఈ విజయంతో ఒహియో గవర్నర్‌గా ఎన్నికైన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో ఒహియో రాష్ట్రం రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా నిలిచింది. డొనాల్డ్ ట్రంప్ తన మూడు అధ్యక్ష ఎన్నికల్లోనూ ఈ రాష్ట్రంలో విజయం సాధించారు.

అయోవాలోనూ డెమోక్రటిక్ పార్టీ పుంజుకుంది. ఆ పార్టీ అభ్యర్థి రాబ్ శాండ్, రిపబ్లికన్ అభ్యర్థి జాక్ లాన్‌పై విజయం సాధించారు. దీంతో 20 ఏళ్ల తర్వాత అయోవాలో డెమోక్రటిక్ పార్టీకి గవర్నర్ పదవి దక్కింది. రెండు పర్యాయాలు రాష్ట్ర ఆడిటర్‌గా పనిచేసిన రాబ్ శాండ్.. ప్రభుత్వ జవాబుదారీతనం, నిత్యావసరాల ధరల నియంత్రణ, రాజకీయ విభేదాలను తగ్గించడం వంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్లారు.

రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పనిచేసే నాయకుడిగా తనను తాను పరిచయం చేసుకున్నారు. గత దశాబ్ద కాలంగా అయోవాలో రిపబ్లికన్ పార్టీ బలపడుతూ వచ్చింది. 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ ట్రంప్ ఈ రాష్ట్రంలో భారీ ఆధిక్యంతో గెలిచారు. రిపబ్లికన్ అభ్యర్థి జాక్ లాన్‌కు ట్రంప్ మద్దతు కూడా ఉండటంతో ఈ ఓటమి అధ్యక్షుడికి మరో రాజకీయ ఎదురుదెబ్బగా మారింది. చివరిసారిగా 2006లో డెమోక్రటిక్ అభ్యర్థి చెట్ కల్వర్ అయోవా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నుంచి రిపబ్లికన్లే అధికారంలో కొనసాగుతున్నారు.

జార్జియాలో మాజీ అట్లాంటా మేయర్, డెమోక్రటిక్ అభ్యర్థి కీషా లాన్స్ బాటమ్స్ విజయం సాధించారు. రిపబ్లికన్ వ్యాపారవేత్త రిక్ జాక్సన్‌ను ఓడించి రాష్ట్ర గవర్నర్‌గా ఎన్నికయ్యారు. ఈ విజయంతో అమెరికా చరిత్రలో గవర్నర్‌గా ఎన్నికైన తొలి నల్లజాతి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. అంతేకాకుండా 28 ఏళ్ల రిపబ్లికన్ ఆధిపత్యానికి తెరదించారు.

చివరిసారిగా 1998లో డెమోక్రటిక్ అభ్యర్థి రాయ్ బార్న్స్ జార్జియా గవర్నర్‌గా ఎన్నికయ్యారు.

Also Read:బరాముల్లా నుంచి టీమిండియా వరకు!

2027 జనవరిలో బాధ్యతలు చేపట్టనున్న గినా హినోజోసా.. టెక్సాస్‌కు తొలి లాటినా మహిళా గవర్నర్‌గా చరిత్ర సృష్టించనున్నారు. అంతేకాకుండా 1990లో ఆన్ రిచర్డ్స్ గెలిచిన తర్వాత డెమోక్రటిక్ పార్టీ నుంచి గవర్నర్‌గా ఎన్నికైన తొలి వ్యక్తిగా నిలవనున్నారు. ఆన్ రిచర్డ్స్ 1990 నుంచి 1995 వరకు గవర్నర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నుంచి రిపబ్లికన్ పార్టీనే రాష్ట్రంలో అధికారాన్ని కొనసాగించింది.

నాలుగు కీలక రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ ఓటమి ట్రంప్‌కు పెద్ద రాజకీయ సవాలుగా మారింది. ముఖ్యంగా ఆయన మద్దతు తెలిపిన అభ్యర్థులు ఓటమి పాలవడం పార్టీపై ఆయన ప్రభావానికి సంబంధించిన చర్చకు దారితీసింది.

- Advertisement -