ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వార్షిక మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ప్రారంభం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది.
ఈ సందర్భంగా ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) అధ్యక్షుడు కె. జయకుమార్ మాట్లాడుతూ.. నెలల తరబడి చేసిన ఏర్పాట్లు, వివిధ శాఖల మధ్య సమన్వయం మంచి ఫలితాలను ఇచ్చాయని తెలిపారు. ఆలయ పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్యం, చెత్త తొలగింపు, భక్తుల క్యూ నిర్వహణ, అరవణ ప్రసాదం అందుబాటులో ఉంచడం వంటి అంశాల్లో మెరుగైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
Also Read:కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదా?: కేటీఆర్
అదనపు కౌంటర్లు, క్యూ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేయడంతో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పటికీ శబరిమలలో రద్దీని నియంత్రించగలిగామని చెప్పారు.భక్తుల సౌకర్యార్థం పోస్టల్ పార్శిల్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేంద్రాన్ని మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, విమానాల్లో ప్రయాణించే వారు అరవణ ప్రసాదం డబ్బాలను తమ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు వివరించారు. పోస్టల్ శాఖ సిబ్బంది భక్తుల నుంచి అరవణ డబ్బాలను సేకరించి, వారు సూచించిన చిరునామాలకు నేరుగా పంపిస్తారని వెల్లడించారు.

