ఇవాంక కోసం రోడ్లు బాగు చేయలేదు..

213
KTR inaugurates ‘Under Pass' at Ayyappa Society
- Advertisement -

హైదరాబాద్‌ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీ చౌరస్తాలో 450 మీటర్ల పొడవైన అండర్ పాస్‌ను మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పట్నం మహేందర్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ నగరంలో రూ.23వేల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, మరో రూ.3వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని కేటీఆర్‌ తెలిపారు.  ఈ అండర్‌ పాస్‌ బ్రిడ్జిని నిర్ణీత గడువులోగా అధికారులు పూర్తి చేయడం అభినందనీయమన్నారు.

ఇవాంక ట్రంప్‌ పర్యటన కోసమే హైదరాబాద్‌లో రోడ్లు బాగు చేశారన్న ఆరోపణల్లో నిజం లేదని.. నగరంలో రోడ్ల సుందరీకరణ అంతకుముందే చేపట్టామని కేటీఆర్‌ తెలిపారు.

భారతదేశంలోనే ప్రత్యేక అనుకూలతలు సంతరించుకున్న నగరం హైదరాబాద్ అని కేటీఆర్ తెలిపారు. అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్ వరుసగా మూడు సంవత్సరాలు ఎంపిక అయిందని మంత్రి గుర్తు చేశారు. దేశంలో ముంబై నగరం తర్వాత హైదరాబాద్‌ను ఓడిఎఫ్‌గా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ సిబ్బందికి మంత్రి కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

KTR inaugurates ‘Under Pass' at Ayyappa Society
జూన్ నాటికి కామినేని జంక్షన్ ఫ్లై ఓవర్, మార్చి లేక ఏప్రిల్ నాటికి చింతలకుంట అండర్‌పాస్ నిర్మాణం పూర్తి చేస్తామని కేటీఆర్ చెప్పారు. అంబర్‌పేట ఫ్లై ఓవర్ 2019, సెప్టెంబర్ వరకు పూర్తవుతుందన్నారు. వీఎస్టీ నుంచి ఇందిరాపార్క్ వరకు ఫ్లై ఓవర్ నిర్మాణం పరిశీలనలో ఉందన్నారు. జవాబుదారీతనంతో, ప్రణాళికబద్దంగా పనులు చేస్తున్నామని స్పష్టం చేశారు.

ఈ అండర్‌ పాస్‌ బ్రడ్జి పూర్తి కావడంతో అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో ట్రాఫిక్‌ ఇబ్బందులకు మోక్షం కలిగింది.  450 మీటర్ల పొడవున చేపట్టిన ఈ నిర్మాణానికి సుమారు రూ.44.30కోట్లు ఖర్చు చేశారు. అయ్యప్ప సొసైటీ మార్గంలో 220మీటర్లు, కొండాపూర్‌ వైపు 160మీటర్ల పొడవుతో నిర్మించిన అండర్‌పాస్‌ను 7మీటర్ల క్యారేజ్‌వేతో కలుపుకొని మొత్తం 10మీటర్ల వెడల్పుతో చేపట్టారు. అయ్యప్ప జంక్షన్‌ ప్రాంతంలో ప్రస్తుతం గంటకు 9వేలకు పైగా వాహనాలు ప్రయాణిస్తున్నాయి. 2035నాటికి ఈ సంఖ్య 19 వేలకు పెరుగుతుందన్న అంచనాతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. 2016 ఆగస్టు 8న ప్రారంభమైన అండర్‌పాస్‌ నిర్మాణ పనులు పూర్తి కావడానికి 2018 మార్చి వరకు గడువున్నా ముందుగానే పూర్తయింది. దీంతో మాదాపూర్‌ వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.

- Advertisement -