వ్యవసాయాన్ని కార్పొరేట్‌ పరం చేస్తున్న మోదీ: కేటీఆర్‌

179
ktrr
- Advertisement -

కార్పొరేట్ కంపెనీలకు వ్యవసాయం అప్పజెప్పేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. రాజన్న సిరిసిల్లలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి, రైతు బిడ్డ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పంటలు భారీ ఎత్తున సాగవుతున్నాయన్నారు. లక్ష35 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని తెలిపారు. 2015 నుంచి ఈ రోజుకి సుమారు 50లక్షల అదనపు ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. రైతుబంధు, రైతు బీమా సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలతోనే ఇది సాధ్యమైందని తెలిపారు.

పంటలు సేకరించే పని నుంచి కేంద్రం తప్పించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత కేంద్రానిదైతే.. దాన్నుంచి కూడా తప్పించుకుంటుందన్నారు. దేశ పరిస్థితులపై అవగాహన లేకుండా నల్ల చట్టాలను తీసుకువచ్చి.. 700 మంది రైతులను చంపిన తర్వాత, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పిన నరేంద్ర మోదీకి బుద్ధి మారలేదన్నారు.

అనాలోచిత అసమర్ధ నిర్ణయాలతో వ్యవసాయం, విద్యుత్ రంగాన్ని దివాలా తీయించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ పాలనలో నైజీరియా కన్నా ఎక్కువ మంది పేదలు భారతదేశంలో ఉన్నారన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ కన్నా దారుణంగా హంగర్ ఇండెక్స్‌లో భారత్‌కు స్థానం దక్కిందని విమర్శించారు.

ప్రజలతో ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంటుతో సంబంధం లేకుండా విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ పంపిణీని ప్రైవేట్‌పరం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అందుకే రూ.3వేలకు వచ్చే సింగరేణి బొగ్గును కాదని.. రూ.35వేలకు ఆస్ట్రేలియన్ బొగ్గును కొంటున్నారన్నారు. ఇది తన కార్పొరేట్ మిత్రులు చేస్తున్న బొగ్గు వ్యాపారం కోసమేనన్నారు. తన కార్పొరేట్ మిత్రుడిని ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలోకి తీసుకుపోవడం కోసం దేశంలోని వ్యవసాయ, విద్యుత్ రంగాన్ని పణంగా పెట్టి దివాళా తీయించే లక్ష్యంతో ప్రధానమంత్రి మోదీ పని చేయిస్తున్నారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే నూతన విద్యుత్ బిల్లులను అడ్డుకుంటామని శాసనసభ సాక్షిగా చెప్పినట్లు కేటీఆర్‌ గుర్తు చేశారు. బిల్లుచట్టంగా మారితే రైతన్నల ఉచిత కరెంటుతోపాటు దళిత, గిరిజన, రజక, నాయి బ్రాహ్మణ వంటి వృత్తుల వారికి, కొన్ని పరిశ్రమలకు ఇచ్చే సబ్సిడీ విద్యుత్ కూడా పోతుందన్నారు. ప్రీపెయిడ్ మీటర్లతో ముందు డబ్బులు కడితేనే విద్యుత్తు లభిస్తుందన్నారు. ప్రైవేటు కంపెనీలు విద్యుత్ పంపిణీ రంగంలోకి దిగితే పెట్రోల్ రేట్ల మాదిరి రోజురోజుకి విద్యుత్ రేట్లు మారుతాయన్నారు. విద్యుత్ రేట్లు అడ్డగోలుగా భారీగా పెరుగుతాయన్నారు.

నల్ల చట్టాల మాదిరే విద్యుత్ చట్టాలను బలవంతంగా దేశ ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. ఉచితాలు రద్దు చేయాలంటూ మాట్లాడుతున్న ప్రధానమంత్రి తన కార్పొరేట్ మిత్రులకు లక్షల కోట్లు మాఫీ చేశారన్నారు. రైతులకు ప్రోత్సాహాకాలు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నదన్నారు. కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు.. పేదలను కొట్టి పెద్దలకు వేసే ప్రయత్నం జరుగుతోందన్నారు.

ఎట్టి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టాలను అంగీకరించమని ముఖ్యమంత్రి రైతాంగం పక్షాన నిలబడ్డారన్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే 25వేల కోట్ల రూపాయల వరకు రుణాలు ఇస్తామన్నా.. సీఎం కేసీఆర్‌ రైతుల పక్షాననే నిలబడ్డారన్నారు.

- Advertisement -