రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. అనాథ అయిన ఐఐటీ విద్యార్థికి అండగా నిలిచారు. ఇక అసలు విషయంలోకి వెళితే.. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం జోడుబాయి తండాకు చెందిన రాజానాయక్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవటంతో హైదరాబాద్‌లోని చిత్రలేఅవుట్ కాలనీలో ఉన్న అనాథాశ్రయంలో పెరిగాడు. స్థానిక పాఠశాలలో చదివి పదో తరగతిలో 98 శాతం మార్కులు తెచ్చుకొన్నాడు. అతని టాలెంట్ చూసి దిల్‌సుఖ్‌నగర్‌లోని నారాయణ జూనియర్ కాలేజీ ఇంటర్‌లో ఉచితంగా చేర్చుకొన్నది.
రాజానాయక్‌కు ఇంటర్‌లో 96 శాతం మార్కులు రాగా, జేఈఈ మెయిన్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి ఐఐటీ-భువనేశ్వర్‌లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించాడు. అయితే, 8 సెమిస్టర్ల చదువుకు రూ.6.74 లక్షలు, నాలుగేండ్ల హాస్టల్, భోజన వసతికి రూ.1.60 లక్షలు, ఇతర ఖర్చులకు రూ.1.46 లక్షలు, అడ్మిషన్‌కు రూ.20 వేలు.. మొత్తంగా రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతున్నది. ఈ నెల 24 లోపు రూ.20 వేలు చెల్లించి సీటు రిజర్వు చేసుకోవాల్సి ఉంది. అంత డబ్బు కట్టలేక రాజానాయక్ దాతల సహాయాన్ని కోరుతున్నాడు. యూనియన్ బ్యాంక్ కొత్తపేట బ్రాంచి అకౌంట్ నంబర్ 019210011907440, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ UBIN0801925 ద్వారా తనకు ఆర్థిక సహాయం అందించాలని వేడుకొంటున్నాడు.
ఈ నేపథ్యంలో రాజా నాయక్‌కు సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా తెలిపారు. రాజా నాయక్ చదువుకు కావాల్సిన ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు. ఇటీవల ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఓ నెటిజన్ కేటీఆర్‌కు ట్యాగ్ చేయగా, ఆయన తక్షణమే స్పందించి ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆ విద్యార్థిని ఆదుకున్నారు.