తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కేంద్రం, ప్రధాని మోదీ ప్రశంసించడమే తప్ప వాటికి ఒక్క పైసా నిధులు ఇవ్వలేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతున్నదని ఆయన విమర్శించారు. నాలుగున్నరేండ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల అవలంబించిన వైఖరిని చూసే తెలంగాణ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పారన్న కేటీఆర్.. ఇకనైనా ఆ పార్టీ బుద్ధితెచ్చుకోవాలని హితవు పలికారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పోటీచేసిన 103 స్థానాల్లోనూ డిపాజిట్లు దక్కలేదన్న కేటీఆర్.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న ఒక్క ఎంపీ సీటును కూడా బీజేపీ నిలుపుకోలేదని, 17 స్థానాల్లోనూ డిపాజిట్ దక్కదని, ఆ పార్టీకి భంగపాటు తప్పదని ఆయన స్పష్టం చేశారు.
దశాబ్దాలపాటు వివక్షకు గురైన తెలంగాణకు నిధులు కేటాయించాల్సిందిపోయి ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వనివాళ్లు మళ్లీ ఏ మొహం పెట్టుకొని వస్తారు? అని ప్రశ్నించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలను మోసంచేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తారు కాబట్టి.. ప్రజలను అప్రమత్తంచేసేందుకే జరుగుతున్న విషయాలన్నింటినీ ప్రజల ముందు పెడుతున్నామని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాలపట్ల ఒక తీరుగా, బీజేపీయేతర ప్రభుత్వాలపట్ల మరోతీరుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరిని తీవ్రంగా ఖండించారు.