బీజేపీ గుండాల దాడిపై కేటీఆర్,హరీష్

8
- Advertisement -

కరీంనగర్‌లోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు చేసిన దాడి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనను బీఆర్‌ఎస్ అగ్రనాయకత్వం తీవ్రంగా ఖండించింది.ఘటన జరిగిన వెంటనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్….ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఫోన్ చేశారు. అక్కడ జరిగిన పరిస్థితులను, దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో ఉన్న నాయకులు, కార్యకర్తల యోగక్షేమాలపై ఆరా తీసిన కేటీఆర్.. పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని, ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఆయన అనుచరులు ఇలా దాడులకు తెగబడటం అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వారు హింసను ప్రేరేపించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఆయన మండిపడ్డారు.

మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఈ దాడిని తీవ్రంగా పరిగణించారు.శాంతిభద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నా మౌనంగా ఉండటం సరికాదన్నారు.దాడులకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కరీంనగర్‌లో జరిగిన ఈ దాడితో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్ శ్రేణులు నిరసనలకు సిద్ధమవుతుండటంతో పోలీసులు భారీగా మోహరించారు.

- Advertisement -