MSME చెల్లింపుల జాప్యానికి చెక్!

0
- Advertisement -

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) పెద్ద ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చట్ట సవరణకు సిద్ధమవుతోంది. దేశంలోని కోట్లాది ఎంఎస్ఎంఈ సంస్థలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన చెల్లింపుల జాప్యం నివారించడానికి మరియు వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడానికి ‘మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ (MSMED) యాక్ట్, 2006’ లో కీలక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం చట్ట ప్రకారం చిన్న పరిశ్రమల నుండి వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసిన పెద్ద కంపెనీలు 45 రోజులలోపు నిధులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే గడువు దాటినప్పటికీ అనేక పెద్ద కార్పొరేట్ సంస్థలు మరియు ప్రభుత్వ విభాగాలు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఎంఎస్ఎంఈలు తీవ్ర మూలధన కొరతను (Cash Flow Crunch) ఎదుర్కొంటున్నాయి. దీనివల్ల చాలా చిన్న పరిశ్రమలు మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ కొత్త చట్ట సవరణ లక్ష్యం.

గడువులోగా చెల్లింపులు చేయని కంపెనీలపై చట్టపరంగా మరింత కఠినమైన వడ్డీ లేదా జరిమానాలు విధించేలా నిబంధనలను మార్చనున్నారు.చెల్లింపుల ప్రక్రియను పారదర్శకంగా పర్యవేక్షించేందుకు సరికొత్త డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయనున్నారు.ఎంఎస్ఎంఈ కౌన్సిళ్ల ద్వారా బకాయిల వివాదాలను తక్కువ సమయంలోనే పరిష్కరించేలా గడువులను నిర్దేశించనున్నారు.

Also Read:TTD:26 నుంచి జ్యేష్టాభిషేకం

గత బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఆదాయపు పన్ను నిబంధన వల్ల కొన్ని ఆచరణాత్మక ఇబ్బందులు తలెత్తాయి. చిన్న పరిశ్రమలకు మేలు చేయడమే కాకుండా, కొనుగోలుదారులకు కూడా వ్యాపార లావాదేవీలు సులభతరం అయ్యేలా సమతుల్యతను తీసుకురానున్నారు. ఈ చట్ట సవరణ గనుక అమల్లోకి వస్తే, దేశీయ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న ఎంఎస్ఎంఈ రంగానికి సకాలంలో నిధులు అందుతాయి. దీనివల్ల మార్కెట్లో నగదు లభ్యత పెరిగి, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికారిక వర్గాల సమాచారం.

- Advertisement -