కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తల్లిని అనాధలా వదిలేశారు ఆ కుమారులు. వృద్దురాలన్న ఇంగితజ్ఞానం లేకుండా ఇంట్లోనుంచి గెంటేశారు. ఎర్రటి ఎండలో ఆ వృద్దురాలు ఆకలికి అలమటించి పోయింది. ఉండేందుకు గూడు లేక, చేరదీసేవారు లేక ఆ మాతృమూర్తి దిక్కుతోచని స్థితికి చేరింది. కమలవ్వపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలకు మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. కమలవ్వకు తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశించారు.
వివరాల్లోకి వెళ్తే…సిరిసిల్లకు చెందిన కమలవ్వకు నలుగురు కొడుకులు ఇద్దరు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లు చేసి ఆస్తులు కూడా పంచిపెట్టింది. కానీ చివరకు ఆమె పరిస్థితే రోడ్డుపాలవుతుందని పాపం ఊహించలేకపోయింది. ఆస్తులు పంచగా తనకు మిగిలిన ఒక చిన్న ఇంట్లో చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని జీవిస్తుండేది. పెద్ద కొడుకు మహారాష్ట్రలోని భివాండిలో ఉంటున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం సిరిసిల్లకు వచ్చి ఆ ముసలి తల్లిని ఇంట్లోనుంచి గెంటేసి తాళం వేసుకుని వెళ్లిపోయాడు. మిగతా ముగ్గురు కుమారులు కూడా చేరదీసేందుకు ఒప్పుకోలేదు. దీంతో కమలవ్వ అందరూ ఉన్న అనాథలా మారింది. కమలవ్వ కథనం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కమలవ్వ కథ మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. ఆమె దీన గాథను విన్న కేటీఆర్ చలించిపోయారు. ఆమెకు పెద్దకొడుకై అండగా నిలిచాడు. వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. కమలవ్వకు సత్వరమే ఉండటానికి నివాసాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు అందుకున్న అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన కమలవ్వకు ఉండేందుకు తాత్కాలికంగా ఇళ్లు ఏర్పాటు చేశారు. తినడానికి తిండి ఇచ్చారు. ఇకపై కమలవ్వ బాధ్యత తనే తీసుకుంటున్నట్లు కేటీఆర్ ట్విటర్ ద్వారా తెలిపారు. దీనిపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. కమలవ్వను పెద్ద కొడుకులా ఆదుకున్న మంత్రి కేటీఆర్‌పై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.