మా దేశం విడిచి వెళ్లిపో…

172
Indians in America are reeling under a spate

అమెరికాలో భారతీయులపై దాడులు కొనసాగుతునే ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన విక్రంను దుండగులు తుపాకీతో బెదిరించి డబ్బులిచ్చిన తర్వాత కాల్చిచంపారు. గత నెలలో పంజాబ్‌కు చెందిన సూపర్‌మార్కెట్‌ నడుపుతున్న వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. తాజాగా మంచిర్యాలకు చెందిన యువకుడిపై జాత్యహంకార దాడి జరిగింది.సాయి వరుణ్‌ పని చేస్తున్న సంస్థలోకి ప్రవేశించి తుపాకీతో బెదిరించి దుండగుడు దోపిడీకి పాల్పడ్డాడు.

సాయివరుణ్‌ ఎంఎస్‌ చదువుతూ స్థానిక షెల్‌ గ్యాస్‌ స్టేషన్‌లో పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. అమెరికా కాలమాన ప్రకారం శనివారం రాత్రి 8గంటల సమయంలో గ్యాస్‌స్టేషన్‌ కార్యాలయంలోకి నల్లరంగు ముసుగు దుస్తులు ధరించిన దుండగుడు చొరబడ్డాడు. ఆ సమయంలో వరుణ్‌ శ్రీరాంపూర్‌లో ఉన్న తల్లి జయలక్ష్మితో వీడియోకాల్‌లో మాట్లాడుతున్నాడు. లోపలికి వచ్చిన దుండుగుడు తుపాకీతో బెదిరించి లాకర్లు తెరిచి డబ్బులన్నీ దోచుకున్నాడు. ఈ క్రమంలో ‘గెటవుట్‌ ఆఫ్‌ మై కంట్రీ’ (మా దేశాన్ని విడిచి వెళ్లిపో) అంటూ పలుమార్లు తుపాకీ తలపై పెట్టి బెదిరించాడని వరుణ్‌ చెప్పాడు. అప్పటికే వీడియోకాల్‌లో మాట్లాడుతున్న జయలక్ష్మి ఇదిచూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

పెద్ద కుమారుడు సాయికిరణ్‌కు ఫోన్‌ చేసి చెప్పడంతో అతను తమ్ముడి వద్దకు వెళ్లాడు. సీసీటీవీలో దోపిడీ దృశ్యాలను చూసి కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. క్లింటన్‌ సిటీలో గత పద్నాలుగేళ్లలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని విన్నామని సాయికిరణ్‌ చెప్పాడు. భారతీయులతోపాటు ఇక్కడున్న ఇతర దేశాలవారు క్లింటన్‌ సిటీని చాలా భద్రమైనదిగా భావిస్తారని, తన తమ్ముడిపై దాడితో వారంతా ఆందోళన చెందుతున్నారని తెలిపాడు.