చేనేత రంగానికి పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కృషిచేస్తున్నారు. కేటీఆర్ చేస్తున్న కృషితో మురిసిపోయిన సిరిసిల్ల నేతన్న నల్ల విజయ్ అరుదైన కానుకను అందజేసేందుకు సిద్దమయ్యాడు. చేనేత వస్త్రంపై కేటీఆర్ దంపతుల ఫోటోను నేశాడు. కేటీఆర్ దంపతుల ఫోటోను వస్త్రంపై నేసిన విజయ్.. త్వరలోనే మంత్రి కేటీఆర్‌కు అందజేయనున్నారు. నల్ల విజయ్ శ్రీశాల చేనేత కళకు ప్రాణం పోసిన కళాకారుడు.
చేనేత వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించడానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్న కేటీఆర్…. నేతన్నలు తల ఎత్తుకుని తిరిగే రోజులు రావాలనే సంకల్పంతో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటు జాతీయ స్ధాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలు కేసీఆర్ కిట్‌తో సహా వివిధ పథకాలలో చేనేత వస్త్రాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలందరూ చేనేత వస్త్రాలు ధరించేలా చేనేత లక్ష్మి కార్యక్రమాన్ని సైతం తీసుకొచ్చారు. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా తానే నేతన్నకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారి ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తానని ప్రకటించి…స్పూర్తిగా నిలిచారు. కేటీఆర్ స్పూర్తితో మొదలైన ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోంది. సినీ నటుల దగ్గరి నుంచి ప్రజా ప్రతినిధుల వరకు అందరు చేనేతకు చేయూత నందించేందుకు ముందుకొస్తున్నారు.
అంతేగాదు రాష్ట్రంలో చేనేత టెక్స్ టైల్స్ పార్క్స్ ఏర్పాటు చేయడటమే కాకుండా ప్రభుత్వం తరపున రాయితీలతో ప్రోత్సాహం అందించేందుకు నేతన్నకు చేయూత అంటూ తోడ్పాటునందిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో నేత వృత్తికి పూర్వవైభవం వస్తోంది. సినీ నటి సమంతను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నారు. చేనేతకు చేయూతను అందిస్తున్న కృషిని అంతా అభినందిస్తున్నారు.