వైభవ్‌ని ఎలా తప్పిస్తారు?

2
- Advertisement -

భారత టీ20 జట్టులోకి దూసుకొచ్చిన 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టు మేనేజ్‌మెంట్ హ్యాండిల్ చేసిన తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌ల సందర్భంగా ఈ యువ ఆటగాడిని పక్కన పెట్టడంపై కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లను ఆయన తీవ్రస్థాయిలో కడిగిపారేశారు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మూడు మ్యాచ్‌ల తర్వాత సూర్యవంశీని బెంచ్‌కే పరిమితం చేయగా.. ఐర్లాండ్ సిరీస్‌లో అసలు ఆడే అవకాశమే ఇవ్వలేదు.

ఐదో టీ20 టాస్ సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జట్టుకు ఏది మంచిదో అదే చేయాలనుకుంటున్నాం, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం” అంటూ సూర్యవంశీ డ్రాప్‌ను సమర్థించుకోవడాన్ని శ్రీకాంత్ తీవ్రంగా తప్పుపట్టారు. టాస్ తర్వాత శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూసి నాకు చాలా కోపమొచ్చింది. మాట్లాడే పద్ధతి ఇది కాదు. ఆటగాళ్లను మీరు ఎలా చూసుకుంటున్నారు, ఒక యువ జట్టును ఎలా తీర్చిదిద్దుతున్నారనేది ముఖ్యం. ఆటగాళ్ల ఫామ్‌ను బట్టే పక్కన పెట్టాలనుకుంటే, అదే సూత్రం కోచ్ గౌతమ్ గంభీర్‌కు, కెప్టెన్ అయ్యర్‌కు కూడా వర్తించాలి కదా? ఆటగాళ్లు సరిగ్గా ఆడటం లేదంటున్నారు సరే.. మరి మీ ప్రదర్శన ఎలా ఉంది? అని ప్రశ్నించారు.

Also Read:ఇరాన్‌పై అమెరికా క్షిపణి దాడులు!

యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపాల్సిన బాధ్యత సీనియర్లపై ఉందంటూ శ్రీకాంత్ తన కెప్టెన్సీ రోజులను గుర్తు చేసుకున్నారు. వైభవ్ సూర్యవంశీ చేసిన తప్పేంటి? యువ ఆటగాళ్లను ఇలాగేనా ప్రోత్సహించేది? ఒకవేళ సంజూ శాంసన్ జట్టుకు సరిపోతాడని అనుకుంటే మొదటి నుంచీ అతన్నే ఆడించాల్సింది. మధ్యలో వైభవ్‌ను తీసుకొచ్చి, ఆపై వెంటనే తొలగించి అతని భవిష్యత్తుతో ఎందుకు ఆడుకుంటున్నారు? అతని కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తున్నారు అని మండిపడ్డారు.

16 ఏళ్ల వయసులో సచిన్ టెండూల్కర్ పాకిస్థాన్ పర్యటనతో అరంగేట్రం చేసినప్పుడు నేను కెప్టెన్‌గా ఉన్నాను. అప్పుడు నేను సచిన్ దగ్గరకు వెళ్లి.. ‘ఈ టూర్ మొత్తం నిన్ను జట్టులో నుంచి తీసేయరు, నువ్వు ఎలాంటి భయం లేకుండా నీ ఆట ఆడుకో’ అని చెప్పాను. గంభీర్, శ్రేయస్ అయ్యర్ కలిసి వైభవ్‌కు అలాంటి నమ్మకాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వారు వ్యవహరించిన తీరు ఏమాత్రం సమంజసం కాదు అని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -