రేవంత్‌రెడ్డిపై కొండా దంపతుల సీరియస్…త్వరలో కీలక నిర్ణయం..?

135
konda
- Advertisement -

హుజురాబాద్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో కొత్త చిచ్చు పెట్టాయి. కాంగ్రెస్ టికెట్ వ్యవహారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ సీనియర్ నేతలు కొండా దంపతులకు మధ్య విబేధాలకు దారి తీసింది. వాస్తవానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖకు హుజురాబాద్‌లో పోటీ చేయడం ఇష్టం లేదు. కాని పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి వత్తిడి చేయడంతో పోటీకి ఒప్పుకుంది. కాని వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్‌ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి సీట్లు తమకు లేదా తమ వర్గానికి ఇవ్వాలని కండీషన్లు పెట్టింది. కొండా దంపతుల కండీషన్లకు ముందు సరేనన్న రేవంత్ రెడ్డి అధిష్టానంతో మాట్లాడి ఒప్పిస్తా అని హామీ ఇవ్వడంతో సురేఖ హుజురాబాద్‌లో పోటీకి రెడీ అయింది. అయితే భూపాలపల్లి సీటు రేవంత్ రెడ్డికి, కొండా దంపతులకు మధ్య చిచ్చు పెట్టింది. ఆ నియోజవకర్గంలో తమ కూతురును పోటీ చేయించాలని కొండా దంపతులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్‌లో చేరడంతో ఇక ఆ సీటు తమకే అని కొండా ఫ్యామిలీ ఫిక్స్ అయిపోయింది. కాని రేవంత్ రెడ్డి కొండా కుటుంబం ఆశలపై నీళ్లు చల్లాడు. తన టీడీపీ దోస్తు అయిన గండ్ర సత్యనారాయణ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుని భూపాలపల్లి సీటు ఆయనకే అని ప్రకటించాడు. దీంతో కొండా సురేఖ రేవంత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు రేవంత్ అధిష్టానంతో మాట్లాడి కొండా దంపతులకు మూడు సీట్లకు కూడా ఎసరు పెట్టాడు. కాంగ్రెస్‌లో ఎవరికైనా ఒక సీటు మాత్రమే అని,వరంగల్ తూర్పు, పరకాల, హుజురాబాద్‌లో ఏ సీటు కావాలో కోరుకో అక్కా…‎ఇక భూపాలపల్లిని మర్చిపో అని తేల్చి చెప్పాడంట.

భూపాలపల్లి సీటు విషయంలో నమ్మించి మోసం చేయడమే కాకుండా వరంగల్, పరకాల నియోజకవర్గాల్లో కూడా తమను లేకుండా చేస్తున్నాడని రేవంత్ రెడ్డిపై కొండా దంపతులు మండిపడుతున్నారంట… అందుకే హుజురాబాద్‌లో పోటీ చేయనని సురేఖ అధిష్టానం పెద్దలకు తేల్చిచెప్పిందంట…టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని నమ్మవద్దన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నా పెడ చెవిన పెట్టి….తమ్ముడు అంటూ రేవంత్‌ను వెనకేసుకువచ్చినందుకు తమకు తగిన శాస్త్రే జరిగిందని సురేఖ ఆవేదన చెందుతుందంట..మొత్తంగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ వ్యవహారంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, కొండా దంపతులకు మధ్య పూడ్చలేని గ్యాప్ ఏర్పడిందనే చెప్పాలి. కాంగ్రెస్ సీనియర్లతో కలిసి కొండా సురేఖ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు, మున్ముందు రేవంత్ రెడ్డికి చుక్కలు చూపించడం ఖాయమని హస్తం పార్టీలో చర్చ జరుగుతోంది.

- Advertisement -