హుజురాబాద్‌ కమలంలో వర్గపోరు..!

39
etela

హుజురాబాద్ ఉప ఎన్నికలకు పోలింగ్ దగ్గరపడుతున్న వేళ…బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఇంటా, బయట ఎదురుగాలి వీస్తోంది. దసరా పండుగ సందర్భంగా కేంద్రం గ్యాస్ , పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా హుజురాబాద్‌లో మహిళలు గ్యాస్ సిలిండర్లతో బతుకమ్మ ఆడి బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే టీఆర్ఎస్ దూకుడుతో పరేషాన్‌లో ఉన్న ఈటలకు కేంద్రం పెట్టిన గ్యాస్ మంట మరింత మంటెక్కిస్తోంది. ఇప్పటికే గత నాలుగు నెలలుగా తన ఒకప్పటి క్లోజ్ ఫ్రెండ్, మంత్రి హరీష్‌రావు దెబ్బకు తన ముఖ్య అనుచరులతో సహా బీజేపీ కీలక నేతలు, కార్యకర్తలంతా వేలాదిగా టీఆర్ఎస్‌లో చేరడం ఈటలను కుంగదీసింది.

దీనికి తోడు హుజురాబాద్‌లో మిగిలిన కొద్దిమంది బీజేపీ నేతల్లో చోటు చేసుకున్న వర్గ విబేధాలు ఈటలకు తలనొప్పిగా మారాయి. హుజురాబాద్ బీజేపీలో గత కొన్నాళ్లుగా నెలకొన్న వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది. తాజాగా హుజురాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు నందగిరి మహేందర్ రెడ్డి (లడ్డు)ను తొలగిస్తూ నూతన హుజురాబాద్ పట్టణ శాఖ కన్వీనర్‌గా గంగిశెట్టి ప్రభాకర్‌ను నియమిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విడుదల చేసిన లేఖ కాషాయ పార్టీలో తీవ్ర కలకలం రేపింది.ఇప్పటికే హుజురాబాద్‌లో ఈటలకు బీజేపీ నేతలు సహకరించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను పాల్పడ్డాడనే కారణంతో ఏకంగా హుజురాబాద్ పట్టణ జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డిని తొలగించడంతో స్థానిక కాషాయ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

విద్యార్థి దశ నుండి బీజేపీ అనుబంధ సంఘాల్లో పనిచేస్తూ పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్న మహేందర్‌ను దురుద్దేశంతోనే ఎన్నికల వేళ తప్పించారని స్థానిక బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. భవానీ దీక్ష నిమిత్తం కరీంనగర్‌కు వస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సమక్షంలో జిల్లా నాయకత్వంపై తాడోపేడో తేల్చుకునేందుకు మహేందర్ రెడ్డి వర్గం సిద్ధమైనట్లు సమాచారం. మొత్తంగా హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న వేళ… స్థానిక బీజేపీలో రగులుతున్న వర్గ విబేధాలు ఈటల రాజేందర్‌‌కు టెన్షన్ పెట్టిస్తున్నాయి. మరి బండి సంజయ్ హుజురాబాద్ బీజేపీలో నెలకొన్న సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తాడో చూడాలి.