ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి.. నీకు అధికారం ఉంది కదా అని నేను ఏం చేసినా నడుస్తది అనుకుంటే ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మూడేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ అంటే కేవలం కొడంగల్, మధిర మాత్రమే కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలని హెచ్చరించారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పాలన సాగించాలని హితవు పలికారు.
తాను ప్రజల సొమ్మును తినే మనిషిని కాదని, ప్రజాధనాన్ని కాపాడటమే తన లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కాంట్రాక్టు పనులకు సంబంధించిన టెండర్ల విషయంలోనూ తన వైఖరిని వెల్లడించారు. ఒక పనికి ఎంత టెండర్ వేస్తున్నారో చెబితే, దానికంటే 20 శాతం తక్కువకే తాను టెండర్ వేస్తానని అన్నారు. తద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు డబ్బు ఆదా అవుతుందని పేర్కొన్నారు.
Also Read;KTR:కేంద్రం సహకారంతోనే ఏపీ జలదోపిడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

