బీఆర్ఎస్ ఆవిర్భావం భారత రైతులకు ఉషోదయం అన్నారు పోలీస్ అకాడమీ ఛైర్మన్ కోలేటి దామోదర్. రైతు దేశానికి వెన్నెముక”, “రైతు దేశానికి అన్నదాత”, “రైతేరాజు” వంటి శుష్క నినాదాలు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి, మనం రాజకీయ నాయకుల నుంచి వింటున్నాం. అయితే, నిజానికి మన నాయకులు ఈ నినాదాలతో తమ పబ్బం గడుపుకోవడమే తప్ప, రైతులకు ఒరగపెట్టింది ఏమీ లేదు అన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి, ముఖ్యమంత్రిగా కేసిఆర్ గారు ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తరువాత మాత్రమే పై నినాదాలకు ప్రాణం వచ్చింది. దేశంలో స్వాతంత్య్రానంతరం ఏ ముఖ్యమంత్రి తలపెట్టని విధంగా రైతులకు వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించడంతో పాటు, “రైతుబంధు” పథకం ద్వారా పంట పెట్టుబడి క్రింద సంవత్సరానికి ప్రతి ఎకరానికి పది వేల రూపాయలను రెండు విడతలుగా, చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి రైతుకు ఇస్తున్న ఏకైక రాష్ట్రం కేసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పూర్వం రైతులు ఎరువుల కోసం, పురుగు మందుల కోసం రోజుల తరబడి క్యూలో నిలబడి, పోలీసులతో లాఠీ దెబ్బలు తినడం పరిపాటిగా వుండేది. ఈ పరిస్థితి పోయి, రైతులకు రసాయనిక ఎరువులు, పురుగు మందులు సునాయాసంగా అందుబాటులోకి తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
తెలంగాణలో ఈనాడు “రైతేరాజు”, “అన్నదాత” పదాలకు కేసిఆర్ గారు సార్థకత చేకూర్చారు. “దేశానికి వెన్నెముక” అయిన రైతులు పంజాబ్ బార్డర్ లో నడిరోడ్డుపై న్యాయం కోసం సంవత్సరం నాలుగు నెలలుగా ధర్నా చేస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో చలనం రాకపోవడం చూసిన “రైతు బాంధవుడు” కేసిఆర్ గారి హృదయం ద్రవించిపోయిందన్నారు. పుష్కలంగా ప్రకృతి వనరులు కలిగిన భారత దేశానికి ఈ దౌర్భాగ్యం ఏమిటి, ఏమీ లేని చైనా మన కళ్ళ ముందే 70 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి సాధించి, అమెరికాకు ధీటుగా ప్రపంచ పటం మీద నిలబడితే, మనకేమిటి ఈ ఖర్మ అని కేసిఆర్ మనసు పరితపించిపోయింది. ఎన్నో దివారాత్రాలు ఈ ఆలోచనలతో సతమతమైన కేసిఆర్ ఎంతో మేధోమధనం జరిపిన తరువాత ఆయన గ్రహించిన విషయం ఏమిటంటే ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యమల్లా దేశానికి సరైన నాయకత్వం లేకపోవడమేనని. దేశ భవితకు తగిన దిశానిర్దేశం చేయగల నాయకత్వాన్ని రూపొందించడానికి ఆయన గత రెండు మూడేళ్ళుగా చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రతిపక్షాలన్నిటినీ ఒక త్రాటిమీదకు తెచ్చి, నాయకులందరిలోనూ దేశాభివృద్ధి పట్ల భావసారూప్యతను సాధించాలని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక చివరి ప్రయత్నంగా ఆయన ఈ బృహత్ కార్యానికి స్వయంగా తానే నడుంబిగించడం తప్ప గత్యంతరం లేదనే నిర్ణయానికి వచ్చారన్నారు.
ఆయనకు ఈ ఆలోచన కలగడానికి ఎన్నో విషయాలు దోహదం చేశాయి. అందులో ఒకటి తెలంగాణ రాష్ట్రానికి చుట్టుపక్కల గల ఇతర రాష్ట్రాలకు చెందిన గ్రామాల ప్రజలు తమ గ్రామాలను కూడా తెలంగాణలో కలపమని చేస్తున్న డిమాండ్. మహారాష్ట్రకు చెందిన 14 గ్రామాల ప్రజలంతా ఒక చోట సమావేశమై తమ ప్రాంతాలు కూడా తెలంగాణలా అభివృద్ధి చెందాలంటే తమ ప్రాంతాలను కూడా తెలంగాణలో కలపాలనే నిర్ణయానికి వచ్చి, ఆ ప్రకారం ప్రభుత్వానికి వినతి పత్రం కూడా వారు సమర్పించారు.
ఇవన్నీ చూసిన కేసిఆర్ కి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఋణం తీర్చుకోడంతో పాటు, ఒక భారతీయుడిగా దేశమాత ఋణం కూడా తీర్చుకోవాలని కోరిక కలిగింది. ఇందుకుగాను ఆయన తన మానసపుత్రిక అయిన టీఆర్ఎస్ పార్టీ పేరును “భారత రాష్ట్ర సమితి” (బీఆర్ఎస్) గా మార్చి, పార్టీని జాతీయ పార్టీగా విస్తరింపజేశారు. ఈ పార్టీ ఆవిర్భావం డిసెంబర్ 9 మధ్యాహ్నం గం. 1:20 నిమిషాలకు హైదరాబాద్ టీఆర్ఎస్ భవన్ లో జరిగింది. జాతీయ స్థాయిలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సం న్యూఢిల్లీలో డిసెంబర్ 14 మధ్యాహ్నం గం. 12:47 నిమిషాలకు జరిగింది.ఈ దివ్య ముహూర్తం భారత దేశానికి మరొక స్వర్ణయుగం ప్రారంభానికి నాంది. భారత రైతాంగానికి తమ కలలు సాకారమవుతున్న ఉషోదయం. “ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్” అన్న నినాదంతో భారత దేశ రైతులందరినీ సమైక్యం చేసే ముఖ్య ఘట్టం హస్తినలో ప్రారంభమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసిఆర్ గారు భారతదేశానికి మరొక స్వర్ణయుగాన్ని సాధించి, చరిత్ర సృష్టించబోతున్నారని తెలిపారు.
ఇవి కూడా చదవండి..