తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.30 నుండి 9.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
ఈ కారణంగా జనవరి 28న కల్యాణోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది.
Also Read:బీజేపీ సీఎం పదవి ఆఫర్ చేసింది: సిసోడియా