తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించింది టిటిడి. టిటిడి అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది.
శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు.
ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి సందర్భాల్లో శ్రీవారి ఆలయంలో ఏటా నాలుగు పర్యాయాలు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తుంటారు.