ఐపీఎల్‌: చెన్నైపై కోల్‌కతా గెలుపు

93
- Advertisement -

నిన్న ఐపీఎల్‌ 2022లో భాగంగా తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌- కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడగా..చెన్నైపై ఆల్‌రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌రగొట్టిన కోల్‌కత్తా జ‌ట్టు 6 వికెట్ల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది. మొద‌ట బౌలింగ్‌లో సీఎస్కేను భారీ స్కోర్ చేయ‌నీయకుండా క‌ట్ట‌డి చేసిన కేకేఆర్..ఆ తర్వాత ల‌క్ష్యాన్ని సునాయ‌సంగా చేధించింది. బ్యాటింగ్‌లో ధోని, బౌలింగ్‌లో బ్రావో పోరాడిన‌ప్ప‌టికీ సీఎస్కేను ఓట‌మి నుంచి కాపాడ‌లేక‌పోయారు.

తొలుత టాస్ గెలిచిన కేకేఆర్ ప్రత్యర్థికి బ్యాటింగ్ చేపట్టింది. ధోనీ మునుపటి ఆటతీరును ప్రదర్శిస్తూ 38 బంతుల్లోనే 7 ఫోర్లు, సిక్సర్‌తో 50 పరుగులు చేయడంతో 5 వికెట్ల నష్టానికి 131 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. రాబిన్ ఉతప్ప 28, రాయుడు 15, కెప్టెన్ రవీంద్ర జడేజా 26 పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు తీసుకోగా, చక్రవర్తి , రసెల్ చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 132 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా మరో 9 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. అజింక్య రహానే 44, వెంకటేశ్ అయ్యర్ 16, నితీశ్ రాణా 21, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 20 (నాటౌట్), శామ్ బిల్లింగ్స్ (25) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో 3 వికెట్లు తీసుకోగా, మిచెల్ శాంట్నర్ ఒక వికెట్ పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు దక్కింది.

ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 25 సార్లు తలపడగా చెన్నై 17సార్లు విజయం సాధించింది. కేకేఆర్ 8సార్లు మాత్రమే చెన్నైపై గెలవగలిగింది. దీంతో ఈసారి కూడా చెన్నైదే విజయమని అందరూ భావించారు. కానీ, కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ జట్టు ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టింది.

- Advertisement -