సదానందగౌడతో కిషన్ రెడ్డి భేటీ..

166
kishan reddy

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి మంగళవారం, గౌరవ కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ సదానంద గౌడతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ సీజన్లో తెలంగాణ రాష్ట్రానికి ఎరువులు సరఫరా చేసే అంశంపై ఇరువురు చర్చించారు. ఈ అంశంపై వివరాలు తెలుసుకునేందుకు గౌరవ కేంద్ర మంత్రి.. సంబంధిత శాఖ అధికారులతో స్వల్ప వ్యవధిలోనే సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎరువుల శాఖ విభాగం అధికారులు, ఎరువుల సరఫరా పై కింది అంశాలు వెల్లడించారు.•2020 ఖరీఫ్ సీజన్‌ మొత్తానికి గానూ.. తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అని ప్రతిపాదనలు అందాయి.•తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు.. 8 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం కాగా ఎరువుల విభాగం 10.17 లక్షల మెట్రిక్ టన్నులను అందుబాటులో ఉంచింది. (4.01 లక్షల మెట్రిక్ టన్నుల ప్రారంభ స్టాక్‌తో కలుపుకుని)

•ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు 8.68 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకం జరగింది. గతేడాది ఇదే సీజన్‌లో 5.09 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అమ్ముడైంది. ఈ సీజన్‌లో యూరియాకు ఊహించని విధంగా అధిక డిమాండ్ ఏర్పటినప్పటికీ.. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం.

•దీంతోపాటుగా.. ఆగస్టు, 2020 కోసం 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల డిమాండ్ ఉండగా.. ఎరువుల విభాగం 4.52 లక్షల మెట్రిక్ టన్నుల మొత్తాన్ని (2.67 లక్షల మెట్రిక్ టన్నుల ప్రారంభ స్టాక్‌తో సహా) అందుబాటులో ఉంచింది. ఆగష్టు 31, 2020 నాటికి తెలంగాణలో అందుబాటులో ఉన్న యూరియా స్టాక్ 1.49 లక్షల మెట్రిక్ టన్నులు.

•దీనికి సంబంధించి, 2020 సెప్టెంబర్ నెలలో 2 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా కోసం అభ్యర్థనలు అందగా.. 2.10 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరాను కేటాయించడం జరిగింది. దిగుమతి చేసుకున్న యూరియా 2020 సెప్టెంబర్ నెల మధ్యనాటికి తెలంగాణకు సమీపంలోని ఓడరేవులను ఇవి చేరుకోవచ్చని భావిస్తున్నాము.

కేంద్ర ఎరువుల విభాగం.. తెలంగాణ రాష్ట్ర ఎరువుల అవసరాలను నిశితంగా పరిశీలిస్తుందని, క్షేత్ర స్థాయి అవసరాలను తీర్చడానికి రాష్ట్ర రైతులకు అవసరమైన యూరియా నిల్వలను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పంపిణీ చేస్తామని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ సదానంద గౌడ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డికి ఈ సంధర్భంగా హామీ ఇచ్చారు.