తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణాలపై కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని ఇప్పటికే రూ. 6,280కోట్లు ఖర్చు చేశామని, ఉత్తర ప్రాంత రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి రూ. 18,772 కోట్లతో అంచనాలు సిద్ధం చేశామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం భూములు అందజేస్తే మిగిలిన నిర్మాణాలు కూడా త్వరగా నిర్మాణాలు పూర్తి అవుతాయన్నారు. భూముల అందజేతలోనే జాప్యం జరుగుతుందని వివరించారు. శనివారం బీజేపీ నగర కార్యాలయంలో మీడియా సమావేశంలో జాతీయ రహదారులు, కనెక్టివిటీలకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పనులు 95 శాతం పూర్తి అవుతున్నా, రాష్ర్ట ప్రభుత్వం ల్యాండ్ అక్విజేషన్ పోజిషన్ ద్వారా అందించాల్సిన భూమిని అందించకపోవడంతోనే నిర్మాణంలో జాప్యం జరుగుతుందని ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, మరోమారు సీఎంకు లేఖ రాస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో పది జాతీయ రహదారులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. త్వరలోనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభానికి రానున్నారని చెప్పారు. అంతేగాక మరిన్ని రహదారులు, కనెక్టివిటీ దారులపై ఆయనకు వివరించానని, కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు.
ఎన్ హెచ్ 44, 167, 202, 565, 65, 365ఎ, 61 వేల కోట్ల రూపాయలతో తెలంగాణ చుట్టు ప్రాంతాలను ఇతర రాష్ర్టాలతో కనెక్టివిటీని మరింత మెరుగుపరిచే పనులు చేపట్టామని దాదాపు పనులు పూర్తి కావచ్చయన్నారు. ఆయా చోట్ల రాష్ర్ట ప్రభుత్వం భూములు అందించకపోవడంతో ఆలస్యం జరుగుతుందన్నారు. ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వరకు ఆరులేన్ల విస్తరణ రూ. 300 కోట్లతో పూర్తయ్యిందన్నారు. నగరం నుంచి ఎయిర్ పోర్ట్ కు వెళ్లే ప్రజలకు సిగ్నల్స్ ఫ్రీ గా ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అంబర్ పేట్ ఫ్లై ఓవర్ కింద రోడ్డు నిర్మాణం కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, రాష్ర్ట ప్రభుత్వం ల్యాండ్ అక్విజేషన్ ద్వారా భూమిని అప్పగిస్తే ఈ పనులు మొదలు పెడతామన్నారు.
మహాబూబ్ నగర్– జడ్చర్ల, మిర్యాలగుడ, నకిరేకల్–నాగార్జునసాగర్, హైదరాబాద్–పూణే, కోదాడ–ఖమ్మం, నిర్మల్ ఖానాపూర్, మంచిర్యాల – రేపల్లెవాడ, మహాబూబ్ నగర్–చించోలి, మహాబూబ్ నగర్–కల్వకుర్తి లాంటి అనేక జాతీయ రహదారి పనులు పూర్తి కావచ్చాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తాము ఎలా నెరవేరుస్తామని, ఇంటింటికి స్వదస్తూరితో పోస్టులు పంపి మరీ ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలను నిసిగ్గుగా మోసం చేసే విధానాలకు తెరదీస్తున్నారని తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు.
Also Read:ప్రభుత్వంకు నీటి ప్రణాళిక లేదు: జగదీష్ రెడ్డి
కేంద్రం ఇచ్చిన హామీలు, ప్రాజెక్టులు వందకు వంద శాతం పూర్తి చేస్తుందని అందులో ఏవైనా అనుమానాలు ఉంటే అడగాలని అన్నారు. అంతేగాని సోనియా, రాహుల్, రేవంత్ ఇచ్చిన హామీలతో తమకు సంబంధం ఏమిటని నిలదీశారు. కోచ్ ఫ్యాక్టరీపై అసత్యాలు, అప్పులపై ఏడుపులు, హామీలపై దాటవేత ధోరణి, భాషపై అబద్ధాలు ఇదే ఈ పార్టీల, వ్యక్తుల అసలైన విధానమని కిషన్ రెడ్డి విమర్శించారు.
తెలంగాణకు ఉన్న అప్పులను చూసి తనకు తిండి కూడా ఒంటబట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలపై కిషన్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. తెలంగాణకు బీఆర్ఎస్ హయాంలోనే రూ. 7.50 లక్షల కోట్ల అప్పు ఉందని పలు సందర్భాలలో స్వయానా సీఎం రేవంత్ రెడ్డియే తెలిపారని, ఇప్పుడేమో తనకు అప్పు ఇంతగా ఉందని తెలియదని అనడం ఏంటని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అన్ని ప్రాజెక్టులు, ప్రకటించిన అన్ని పనులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించిన ప్రాజెక్టులు వారే నిర్వహించాలని కూడా తెలియదా? అని నిలదీశారు. శనివారం బీజేపీ నగర కార్యాలయంలో మీడియా సమావేశం కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ విధానాలపై విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రయోజనాల గురించి చేతులెత్తేసిన సీఎం తమకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత తమదని అన్నారు. తెలంగాణ రాష్ర్టంలో గానీ, దక్షిణ భారతదేశంలో గానీ ఒక్క సీటు కూడా తగ్గదని అన్నారు. తెలంగాణలో ఓట్లు తగ్గినా, జనాభా తగ్గినా పార్లమెంట్ సీట్లు తగ్గబోవని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్వయానా ప్రధాని మోదీ లోక్ సభలో చెప్పారని అన్నారు. దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గే అంశంపై స్టాలిన్, రేవంత్ రెడ్డిలు మాట్లాడుతున్నవన్నీ బోగస్ మాటలేనని అన్నారు. జనాభా సేకరణ, రీ ఆర్గనైజేషన్ కమిటీ ఏర్పాటు, అనంతరం గైడ్ లైన్స్ విడుదలవుతాయన్నారు. తమిళనాడులో త్వరలో ఎన్నికలు రానుండడంతో చెప్పుకోవడానికి ఏమీ లేదనందున తమిళనాడును దోచుకున్న స్టాలిన్ కుటుంబం ఓట్ల కోసం అసత్య వాదనలను తెరపైకి తెస్తుందని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో ఏం చేశారో చెప్పుకోవాల్సింది పోయి, హిందీ భాషకు రంగులు వేయాలని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమిళభాషకు పెద్ద పీట వేసిన విషయాన్ని గుర్తు చేశారు. తమిళ కాశీ, గుజరాత్, తెలుగు తమిళ సంఘాన్ని ఏర్పాటు చేశారని, తమిళభాషపై అనేక రీసెర్చ్ లు జరుగుతున్నాయని అన్నారు. నూతన ఎడ్యుకేషన్ పాలసీలో మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చే చర్యలు చేపట్టిన తొలి ప్రభుత్వం, 76 ఏళ్ల తరువాత నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మోదీ ప్రభుత్వమేనన్నారు. హిందీ నేర్చుకోవాలని ఏ ఒక్కరినీ బలవంత పెట్టలేదని అన్నారు.

