రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ నోటీసు!

5
- Advertisement -

లోక్‌సభలో తప్పుడు ఆరోపణలు చేసి సభను తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ నోటీసు దాఖలు చేయనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. రిజిజు…సభను తప్పుదారి పట్టించి, ఆధారంలేని ఆరోపణలు చేసినందుకు రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ నోటీసు ఇస్తాం. లోక్‌సభ, రాజ్యసభల్లో విధి విధానాలకు స్పష్టమైన నియమాలు ఉన్నాయి. ఒక సభ్యుడు మరొకరిపై తీవ్రమైన ఆరోపణలు చేయాలంటే ముందుగా నోటీసు ఇవ్వాలి, వాటికి ఆధారాలు చూపాలి. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపేందుకు ఆయనను సభ ముందు పిలవాలని కోరాను. ప్రధాని భారత్‌ను అమ్మేశారని, భారత ప్రయోజనాలను విక్రయించారని ఆయన చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యం అని అన్నారు.

హర్దీప్ సింగ్ పూరిపై కూడా నోటీసు ఇవ్వకుండా తీవ్రమైన ఆరోపణలు చేశారని రిజిజు పేర్కొన్నారు. బడ్జెట్‌పై మాట్లాడాల్సిన సమయంలో ఎలాంటి వాదనలు లేకుండా, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేసిన తప్పుడు వ్యాఖ్యలన్నీ, అసంస్కృత పదజాలం సభ రికార్డుల నుంచి తొలగించాలి. భారత్‌ను ఎవరూ కొనలేరు, అమ్మలేరు అని నేను గుర్తు చేశాను. కానీ రాహుల్ గాంధీ ‘ఎవరో భారత్‌ను అమ్మారు, ఎవరో కొనుగోలు చేశారు’ అన్నారు. భారత్‌ను కొనుగోలు చేయడం లేదా అమ్మడం ఎవరికీ సాధ్యం కాదు అని రిజిజు స్పష్టం చేశారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ, భారత్–అమెరికా తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ద్వారా ప్రభుత్వం భారత్ మాతను అమ్మేసింది అని ఆరోపించారు. ఈ ఒప్పందం పూర్తి లొంగుబాటు అని ఆయన వ్యాఖ్యానించారు. భారత శక్తి భద్రతను అమెరికాకు అప్పగించారని, రైతుల ప్రయోజనాలు దెబ్బతిన్నాయని అన్నారు.

యూనియన్ బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న ఆయన, ఇండియా కూటమి ప్రభుత్వం చర్చలు జరిపి ఉంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను సమానంగా చూడాలని చెప్పేదని అన్నారు. మీరు భారత్‌ను అమ్మేశారు. మన తల్లి భారత్ మాతను అమ్మేశారని మీకు సిగ్గు లేదా? అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియా–అమెరికా ఒప్పందం కారణంగా శక్తి భద్రత దెబ్బతిన్నదని, ఇకపై భారత్ ఎవరినుంచి చమురు కొనాలన్నది అమెరికానే నిర్ణయిస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Also Read:మున్సిపల్ ఎన్నికలు..ఉద్రిక్త పరిస్థితులు

- Advertisement -