ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధానిని ఉద్దేశించి ఖర్గే చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం నిర్మలా సీతారామన్, అర్జున్ రామ్ మేఘవాల్‌లతో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఖర్గేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఎన్నికల సంఘంతో భేటీ అనంతరం కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. ఖర్గే వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిపై చేసినవి కావని, ఇది మొత్తం దేశానికే అవమానమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తిని ‘ఉగ్రవాది’ అని పిలవడం కాంగ్రెస్ నైతిక పతనానికి నిదర్శనం. గతంలో కూడా వారు ప్రధానిని విష సర్పం అని, సేనాపతి అని రకరకాలుగా దూషించారు. కానీ నేడు అన్ని హద్దులు దాటారు అని రిజిజు మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై ఖర్గే దేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఎన్నికల సంఘం దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.దేశాన్ని ముక్కలు చేయాలని చూసే ఉగ్రవాదులను ప్రధాని మోదీ ఏ విధంగా శిక్షిస్తున్నారో, అదే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో ప్రజలే శిక్షిస్తారని రిజిజు ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రధాని ఒక పార్టీకి మాత్రమే పరిమితం కాదని, ఆయన దేశానికి ప్రతినిధి అని గుర్తు చేశారు.
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సమానత్వాన్ని నమ్మరని, ఆయనొక ‘ఉగ్రవాది’ అన్నట్లుగా వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే పార్టీ బీజేపీతో ఎందుకు జట్టు కడుతోందని ప్రశ్నిస్తూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read:పిల్లలకు మాటలు ఆలస్యమవ్వడం ఆటిజమా?

