అమెరికా మరియు ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరో మలుపు తిరిగాయి. అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనాన్ని (Naval Blockade) తక్షణమే ఎత్తివేస్తేనే తాము చర్చలకు సిద్ధమని ఇరాన్ స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఇరవానీ మాట్లాడుతూ.. వాషింగ్టన్ తన “కాల్పుల విరమణ ఉల్లంఘనలను” ముందుగా ఆపాలని డిమాండ్ చేశారు.అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే. వారు ఈ దిగ్బంధనాన్ని ఎత్తివేసిన వెంటనే, తదుపరి రౌండ్ చర్చలు ఇస్తాంబుల్‌లో జరుగుతాయి” అని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్ ఎప్పుడూ సైనిక దురాక్రమణకు పాల్పడలేదని, వారే తమపై యుద్ధాన్ని ప్రారంభించారని ఆయన ఆరోపించారు. ఒకవేళ అమెరికా రాజకీయ పరిష్కారం కావాలనుకుంటే తాము సిద్ధమని, యుద్ధం చేయాలనుకున్నా ఇరాన్ సిద్ధంగానే ఉందని ఆయన హెచ్చరించారు.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రకటనలపై భిన్నంగా స్పందించారు. ఇరాన్ బహిరంగంగా కఠినంగా మాట్లాడుతున్నప్పటికీ, లోలోపల మాత్రం ‘హోర్ముజ్ జలసంధి’ని (Strait of Hormuz) తిరిగి తెరవాలని కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. జలసంధి మూసివేత వల్ల ఇరాన్ రోజుకు దాదాపు 500 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోతోందని, అందుకే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.
బుధవారం ఓమన్ తీరానికి సమీపంలో ఒక కంటైనర్ షిప్‌పై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఎటువంటి హెచ్చరిక లేకుండానే ఈ దాడి జరిగిందని, దీనివల్ల షిప్ పైభాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
Also Read:పిల్లలకు మాటలు ఆలస్యమవ్వడం ఆటిజమా?

