పంజాబ్‌ను ఆదుకున్న హుడా.. చెన్నై టార్గెట్ 154 పరుగులు..

133
csk

చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ తడబడింది. ఓపెనర్లు శుభారంభం ఇచ్చినప్పటికీ..అదే జోరును కొనసాగించలేక ఇబ్బందులు పడింది. ఆఖర్లో దీపక్ హుడా ఆదుకోవడంతో డీసెంట్ స్కోర్ చేయగలిగింది. నేడు అబుదాబిలో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసి పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో రవీంద్ర జడేజా వీరవిహారంతో సూపర్ చేజింగ్ చేసిన చెన్నై జట్టు ఈ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఛేజింగ్ పై నమ్మకంతోనే ధోనీ టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకున్న సంగతి తెలిసిందే.

మ్యాచ్ విషయానికొస్తే… కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టాపార్డర్ ఆశించిన స్థాయిలో మెరుపులు మెరిపించలేకపోయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 29, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 26, క్రిస్ గేల్ 12, నికొలాస్ పూరన్ 2 పరుగులు మాత్రమే చేశారు. చివర్లో దీపక్ హుడా ధాటిగా ఆడడంతో పంజాబ్ జట్టుకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. దీపక్ హుడా 30 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 62 పరుగులు సాధించాడు. చెన్నై బౌలర్లలో లుంగీ ఎంగిడి 3 వికెట్లు తీసి పంజాబ్ ను సమర్థంగా కట్టడి చేశాడు. శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్, జడేజా తలో వికెట్ తీశారు.