రైతాంగంపై కేంద్రం దాడి చేస్తుంది- మంత్రి జగదీష్ రెడ్డి

38
Minister Jagadish Reddy

ఆదివారం నల్లగొండ జిల్లాలోని చిట్యాలలో నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. మంత్రితో పాటు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. రైతాంగంపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను మోడీ దెబ్బ కొట్టే కుట్ర చేస్తున్నారని మంత్రి విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నీ రైతాంగానికి గొడ్డలి పెట్టు లాంటివి. కార్పోరేట్ సంస్థలకు దోచి పెట్టడానికి కేంద్రంలో పెద్ద కుట్ర జరుగుతుందన్నారు. మోడీ సిద్ధాంతాలతో రైతులు వ్యవసాయాన్ని వదులుకునే పరిస్థితి దాపురించింది. వ్యవసాయాన్ని కేసీఆర్ పండగగా మారిస్తే… మోడీ దండగగా మార్చేస్తున్నాడు. మోడీ రైతు వ్యతిరేక చట్టాలు తేవడం దుర్మార్గమైన చర్య అని మంత్రి మండిపడ్డారు. రైతుల ఆగ్రహానికి మోదీ పతనం కాక తప్పదని ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.