బీజేపీలో చేరిన సినీ నటి ఖుష్బూ..

112
Khushbu Sundar

తమిళ సినీ నటి ఖుష్బూ సుందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నేడు ఆమె బీజేపీలో చేరారు. సోమవారం మధ్యాహ్నం బీజేపీ సీనియర్‌ నేతల సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకుంది. ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆమె కాషాయం తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో జ‌రిగిన చేరిక కార్య‌క్ర‌మంలో ఖుష్బూకు పార్టీ అభ్య‌ర్థిత్వాన్ని సంబిత్ పాత్రా అందించారు. అంతేకాదు ఆమెకు కీలక బాధ్యతలు సైతం అప్పగించే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆరేళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన కుష్బూ పార్టీ నాయకత్వంపై పలు ఆరోపణలు చేస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏమాత్రం ప్రజాబలం లేని నాయకుల చేతిలో కాంగ్రెస్‌ పార్టీ రోజురోజుకూ దిగజారిపోతోందని విమర్శించారు.అంతేకాకుండా తన రాజీనామాకు గల కారణాలు వివరిస్తూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆమె చెప్పారు. తాను ప్రజల కోసం పనిచేసేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. అంతేగానీ, పేరు, ప్రతిష్ఠల కోసం కాదని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో కొన్ని శక్తులు తనను అణచివేశాయని, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో సహకరించిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.