తెలంగాణలోని పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా గణపయ్య నవరాత్రులు నేటితో ముగిశాయి. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలతో దేశవ్యాప్తంగా మారుమోగింది. బైబై గణేశా అంటూ భక్తులు గంగమ్మ ఒడికి తరలిస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రులు అంగరంగా వైభవంగా జరిగి నేటితో ముగుస్తున్న వేళ… ఖైరతాబాద్ మహా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు.
ఖైరతాబాద్ పంచముఖ మహలక్ష్మి గణపతి తొమ్మిది రోజులు ఘనంగా పూజలు అందుకొన్నారు. హుస్సేన్ సాగర్ వద్ద పంచముఖ మహాలక్ష్మి గణనాథుడికి గంటన్నర పాటు పూజలు నిర్వహించారు. అనంతరం హుస్సేన్ సాగర్‌లో గణనాథుడిని నిమజ్జనం చేశారు. సరిగ్గా రాత్రి 7 గంటల సమయంలో ఈ మహా కార్యక్రమం జరిగింది. మహా గణపతి నిమజ్జన ప్రక్రియను వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిమజ్జన ప్రక్రియను చూసి భక్తులు పులకించిపోయారు. గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.
ఖైరతాబాద్ నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా హుస్సేన్ సాగర్ వరకు 6 గంటలకు పైగా శోభాయాత్ర కొనసాగింది. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియను నిర్వహించారు.
67 సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలో తొలిసారి 50 అడుగులు మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన విషయం తెలిసిందే. 70 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న 26 టైర్ల టస్కర్ వాహనంతో మహాగణపతిని తరలించారు. 70 టన్నుల బరువుతో త్రిశక్తి మహాగాయత్రి, షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి సమేతంగా కొలువుదీరిన ఖైరతాబాద్ పంచముఖ మహాగణపతి శోభాయాత్ర.. సన్‌షైన్ థియేటర్, ఐఐఎంసీ కళాశాల చౌరస్తా, టెలిఫోన్ భవన్, పాత సచివాలయం గేటు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ చౌరస్తా, లుంబినీ పార్కు మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంది.