9 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న ఖైరతాబాద్ మహా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. మధ్యాహ్నాం 12 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర సాయంత్రం 4.50కి ముగిసింది. టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా మహాగణపతి ట్యాంక్‌బండ్‌కు చేరుకోగా పూజాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు.
కరోనా నేపథ్యంలో గణనాథునికి వీడ్కోలు పలికేందుకు భక్తులు పరిమిత సంఖ్యలో ట్యాంక్ బండ్ కు తరలివచ్చారు. అడుగడుగునా పోలీస్ భద్రతా మధ్య ప్రశాంతంగా శోభాయాత్ర సాగింది. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నం.3 వద్ద మహాగణపతిని నిమజ్జనం చేశారు.
వినాయక చవితి వచ్చిందంటే గతంలో వీధి వీధి, ఊరూ వాడ ప్రత్యేక శోభను సంతరించుకునేవి. రాత్రి అయ్యిందంటే ప్రతి మంటపం ప్రత్యేక పూజలు జరిగేవి. పదుల సంఖ్యలో జనం మండపాల ముందు కూర్చునేవారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా గణనాథుడిని నిమజ్జనం చేసి తిరిగి వెళ్తున్నారు.