ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మెంటర్ పదవికి రాజీనామా చేశారు. రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు ముందు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. మెంటర్‌గా పనిచేయడానికి అవసరమైన సమయాన్ని కేటాయించలేనందున ఈ సీజన్‌లో ఆ బాధ్యతలు నిర్వర్తించలేనని ఆయన తెలిపారు.
ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో వెల్లడిస్తూ, “ఈ ఐపీఎల్ సీజన్‌లో నేను ఢిల్లీ క్యాపిటల్స్ మెంటర్‌గా కొనసాగలేను. ఈ బాధ్యతకు కావాల్సిన సమయాన్ని ఇవ్వలేను. ఈ సీజన్‌లో జట్టులోని అన్ని ఆటగాళ్లకు నా శుభాకాంక్షలు. అయితే ఈసారి నేను కామెంటరీ బాక్స్‌లో కనిపిస్తాను. ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్ అయిన ఐపీఎల్‌ను మళ్లీ చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ట్వీట్ చేశారు.
Also Read:పెట్రోల్ లేదా డీజిల్‌ను నిల్వ చేయవద్దు:కేంద్రం
దీనికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్పందిస్తూ, “గత సీజన్‌లో మీ పాజిటివిటీ, కష్టం, ప్రేమకు ధన్యవాదాలు లెజెండ్. ఈ సీజన్‌లో కామెంటరీ బాక్స్ నుంచి మాకు మద్దతు ఇస్తూ చూడటం ఆనందంగా ఉంటుంది” అని తెలిపింది.

