ఈ మధ్యకాలంలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంటికి తాళం వేసి ఒక్కరోజు కనిపించలేదంటే.. మరుసటి రోజు ఆ ఇంటిపై దొంగలు కన్నేశారనే అనుకోవాలి. అచ్చం ఇలాగే కేరళకు చెందిన ఓ కుటుంబం ఇంటికి తాళం వేసి.. బంధువుల పెళ్లికి వెళ్లారు. ఇక ఎవరు లేని సమయం చూసుకున్న దొంగ.. ఇంట్లోని బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు.
పెళ్లి నుంచి ఇంటికి వచ్చిన ఆ కుటుంబం ఇంట్లో దొంగలు పడ్డారని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దొంగను వెతికే పనిలో పడ్డారు. ఇంతలో ఏమైందో తెలియదు, దొంగ మనసు మార్చుకున్నాడు. ఆ ఇంట్లో కొట్టేసిన మొత్తం బంగారాన్ని వారి ఇంటికి వచ్చి మరి ఇచ్చెళ్లాడు. నగలతో పాటు ఓ లెటర్ కూడా ఇచ్చాడు. దొంగతనం తప్పే.. కానీ అనుకోని పరిస్థితులలో చేశాను, నన్ను పోలీసులకు పట్టించకండి అంటూ రాశాడు.
ఆ దొంగ మంచితనానికి కరిగిపోయిన ఆ కుటుంబం, కేసు వాపస్ తీసుకుంది. పోయిన నగలు.. పశ్చాతాపంతో దొంగనే తెచ్చి ఇవ్వడంతో వదిలేశారట. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దొంగలలో నీవు మంచి దొంగవు అని, నీవేం దొంగవు రా బాబు.. నీవే ఎత్తుకెళ్లావు, నీవే తెచ్చిచ్చావ్.. నీకు దొంగతనాలు సూట్ కావు కానీ.. మంచిగా ఏదైనా పని చేసుకుని బ్రతుకు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.