ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ పై ఆప్ బహిష్కృత నేత కపిల్ మిశ్రా మరోసారి ఫైర్ అయ్యారు. కేజ్రీవాల్ చేసిన తప్పులను ఒక్కొక్కటిగా బయటపెడతానంటూ మిశ్రా చేసిన సవాళ్ళు పెద్ద దుమారమే రేపాయి. ఆప్ నుంచి కపిల్ మిశ్రాను సస్పెండ్ చెయ్యడంతో కేజ్రీవాల్ ను టార్గెట్ చేసిన మిశ్ర..మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేజ్రీవాల్.. ఏడాదిలో రెండుసార్లు మాత్రమే సీఎం కార్యాలయానికి వస్తారంటూ ట్విటర్ ద్వారా కామెంట్స్ చేశారు. తమ అవినీతి బాగోతం బయటపడటంతో ఆప్ నేతలు భయపడుతున్నారని.. వారికి కేజ్రీవాల్ ధైర్యం చెప్తున్నారని పేర్కొన్నారు.
అంతేకాకుండా ‘ఆ సీఎంకు ఆఫీసుకు వెళ్లేందుకు సమయం ఉండదు గానీ, సర్కార్ 3 సినిమాకు మాత్రం వెళ్లారు’ అని ఆయన అన్నారు. ప్రజలకు, అధికారులకు మాత్రం పూర్తి స్థాయిలో పని చేయాలని సూచించే కేజ్రీవాల్ వారికి కనిపించడం మానేశారని ఆయన విమర్శించారు. కేజ్రీవాల్ స్నేహితులు, బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తే.. ఆయన అవినీతి మరింత వెలుగులోకి వస్తుందని మిశ్రా అన్నారు.
దేశంలోని ముఖ్యమంత్రులందరిలో ప్రజలను అతి తక్కువ సార్లు కలిసిన సీఎం కేజ్రీవాలే అని, ఆయనకు ఒక పోర్ట్‌పోలియో అంటూ ఉండదని, అతి తక్కువగా పని చేస్తూ.. గరిష్టంగా సెలవులు తీసుకునే ఏకైక ముఖ్యమంత్రి ఆయనే అని కపిల్ మిశ్రా పేర్కొన్నారు. అతి త్వరలోనే అత్యంత ఎక్కువ అవినీతిలో కూరుకుపోయిన సీఎంగా కూడా కేజ్రీవాల్ మిగిలిపోతారని ఆయన ఆరోపించారు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా.. కేజ్రీవాల్ ఓ క్రిమినల్‌లా మౌనంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
ఇదిలా ఉండగా…డొల్ల కంపెనీల ద్వారా సీఎం కేజ్రీవాల్ రూ.2 కోట్లు లంచం తీసుకోవడం తాను కళ్లారా చూశానని కపిల్ మిశ్రా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మిశ్రాను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాగా.. ఈ విషయమై మిశ్రా సీబీఐకి ఫిర్యాదు చేశారు. మరోవైపు పార్టీ విరాళాల వివరాలు వెల్లడించాలని అటు ఐటీ శాఖ కూడా కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది.