తెలంగాణకు అన్నీ శుభాలే..

183
KCR Ugadi Greetings to People of State
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రగతిభవన్‌లోని జనహితలో శ్రీ హేవళంబి నామ సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, పలువురు రాష్ర్ట మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి స్వాగతోపన్యాసం చేశారు. వేద పండితులు సీఎం కేసీఆర్‌కు ఆశీర్వచనం పలికారు.

ఈ ఏడాది తెలంగాణకు మంచే జరుగుతుందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అన్నారు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణ.. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలపై దేశం మొత్తం ప్రశంసలు గుప్పిస్తోందని తెలిపారు.ఐఏఎస్ ఐపీఎస్‌లు అద్భుతంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. శాంతిభద్రతల విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు సీఎం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం నిర్వహించారు. తెలంగాణ రాష్ర్టానికి ఈ ఏడాదంతా శుభాదిపత్యమేనని శృంగేరి పీఠానికి చెందిన బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి తెలిపారు. జనహితలో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. రాష్ట్రంలో కర్షక అనుకూల వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కాగా ఆషాడ మాసంలో అన్ని దేవాలయాల్లో వరుణ జపాలు చేయాలని సూచించారు. పంటలు సమృద్ధిగా పండటంతో ధరలు నియంత్రణలో ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అద్భుతంగా విజయవంతమైతయని చెప్పారు. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాఫ్ట్‌వేర్ రంగం మందకొడిగా ఉంటుందన్నారు. కావేరి నదికి ఈసారి పుష్కరాలు వచ్చాయని తెలిపారు. ఈ ఏడాది భారతదేశ ఖ్యాతి విశ్వవ్యాప్తం అవుతుందని పేర్కొన్నారు.

భద్రాద్రి సీతారాముల కల్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా భద్రాద్రి పండితులు సీఎం కేసీఆర్ ఆహ్వానం పలికారు. సకుటుంబ సమేతంగా సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానపత్రికను అందజేశారు.

- Advertisement -