కల్తీపై యుద్దమే.. పట్టిస్తే ప్రత్యేక ప్రోత్సాహకాలు

202
KCR talks tough against adulteration
- Advertisement -

కల్తీ, నకిలీ, జూదం, మోసాలపై ఉక్కుపాదం మోపాలని, ఇలా అన్ని రకాల కల్తీలపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్‌ పోలీసుశాఖను ఆదేశించారు. కల్తీలకు పాల్పడేవారిని అత్యంత నిర్దాక్షిణ్యంగా అణచివేయాలని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఆదివారం ప్రగతి భవన్‌లో డీజీపీ అనురాగ్‌శర్మ సహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులతో కల్తీ ఆహార పదార్థాలు, కల్తీ విత్తనాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. కల్తీ దందాలను సమూలంగా తుడిచిపెట్టేందుకు ఒకటి రెండు రోజుల్లో సమగ్రమైన వ్యూహాన్ని రూపొందించాలని పోలీసు ఉన్నతాధికారులకు నిర్దేశించారు. కల్తీలకు పాల్పడేవారిని పట్టుకుని కేసులు పెట్టేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని, ఇప్పుడున్న చట్టాలు సరిపోవనుకుంటే ఇంతకన్నా కఠినమైన కొత్త చట్టాలను తీసుకొవస్తామని చెప్పారు.

Chief-Minister-K-Chandrashekhar-Rao-Review-meeting-on-adulteration

కల్తీ మహమ్మారిపై పోలీసుశాఖ యుద్ధం ప్రకటించాలని సీఎం చెప్పారు. ఈ మహమ్మారి వల్ల అనేక అనర్థాలు వాటిల్లుతున్నాయని, ఆహార పదార్థాల కల్తీతో ప్రజల ఆరోగ్యాలు పాడవుతుంటే, కల్తీ విత్తనాల కారణంగా రైతులు దారుణంగా నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీలను నిర్ధారించడానికి ఎక్కువ సంఖ్యలో డీఎన్‌ఏ కిట్లు అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో పోలీస్ అధికారులు చేసిన కృషి వల్ల గుడుంబా, పేకాటను నియంత్రించగలిగామని, ఇదే విధంగా కల్తీలను కూడా తరిమేద్దామని అన్నారు. పోలీస్‌శాఖ పై నుంచి కింది స్థాయి దాకా కల్తీల నివారణను సవాల్‌గా తీసుకోవాలని సీఎం చెప్పారు. డీజీపీ నుంచి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వరకు అంతా త్రికరణశుద్ధితో కల్తీపై యుద్ధం చేయాలి. ఎక్కడికక్కడ నిఘా పెట్టాలి. వ్యవసాయ, ఆరోగ్యశాఖ అధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలి. దాడులు నిర్వహించాలి. దోషులను గుర్తించాలి. అత్యంత నిరాక్షిణ్యంగా వ్యవహరించాలి. కఠిన శిక్షలు పడే విధంగా చూడాలి. కల్తీలను గుర్తించడానికి ఎక్కువ సంఖ్యలో డీఎన్‌ఏ కిట్లు అందిస్తాం. వీటివల్ల అన్ని రకాల ఆహార పదార్థాలను, ఎరువులు, విత్తనాలను ఎక్కడికక్కడే పరీక్షించవచ్చు. నిర్ధారించవచ్చు.. కల్తీని వెంటనే గుర్తించవచ్చు.. క్షేత్రస్థాయిలో నకిలీలను గుర్తించి నియంత్రించవచ్చు అని సీఎం అన్నారు.

కల్తీలకు పాల్పడేవారిపై పీడీ యాక్టు పెట్టే వెసులుబాటు కూడా కల్పించాం. అవసరమైతే ఇంతకన్నా కఠినచట్టాలు తెస్తాం. ఏది కావాలన్నా చేద్దాం..కానీ రాష్ట్రంలో ఈ కల్తీ మాత్రం ఉండకూడదు. ఈ దందాలను సమూలంగా తుడిచిపెట్టాలి. యుద్ధానికి పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయండని పోలీసు అధికారులకు సీఎం ఆదేశించారు.

- Advertisement -