ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతును సమీకరించే సన్నాహాల్లో భాగంగా సీఎం కేసీఆర్ సోమవారం డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌తో సమావేశం అవుతారు. ఇందుకోసం ఆయన ఆదివారం మళ్లీ తమిళనాడుకు వెళ్తున్నారు. అయితే వాస్తవానికి ఈ పర్యటన సోమవారమే ఖరారైంది. దక్షిణాది రాష్ట్రాల పర్యటన కోసం బయలుదేరే ముందు కేసీఆర్.. స్టాలిన్‌ను కలిసేందుకు వస్తున్న విషయం గత సోమవారమే ఆయనకు ఫోన్‌లో తెలిపారు. స్టాలిన్ వెంటనే స్పందించి, ఈ నెల 13న చెన్నైకి రావాలని ఆహ్వానించారు.
గత సోమవారం కేరళ, తమిళనాడు రాష్ట్రాలను సందర్శించిన కేసీఆర్ శుక్రవారం తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. దీంతో స్టాలిన్‌తో భేటీ లేనట్టేనని అందరూ అనుకున్నారు. హైదరాబాద్ చేరుకున్నకేసీఆర్ ముందుగా నిర్ణయించిన ప్రకారం 13న స్టాలిన్‌తో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో నేడు మరోమారు తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. ఈ రోజు ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై వెళ్లనున్నారు. శ్రీరంగం, తిరుచ్చి ఆలయాలను సందర్శించిన అనంతరం రాత్రి చెన్నైలో బస చేస్తారు. సోమవారం స్టాలిన్ నివాసంలో కేసీఆర్ భేటీ అవుతారు.