రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మంచినీటి పథకం మిషన్ భగీరథకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి భవన్‌లో మిషన్ భగీరథ, మంచి నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించిన సీఎం… అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో కనీస నీటి వినియోగ మట్టాలను పాటించాలన్నారు.
ప్రాజెక్టుల్లో నీరు ఉండగానే సరిపోదన్న సీఎం.. అవసరమైనప్పుడు ఆ నీటిని విడుదల చేసుకోవడానికి అనువుగా ఉండే విధంగా నీటిని నిల్వ ఉంచుకోవాలని పేర్కొన్నారు. అప్పుడు మాత్రమే అవసరమైనప్పుడు నీటిని విడుదల చేసుకుని మంచినీటి కొరత లేకుండా చూడగలమన్నారు సీఎం. మిషన్ భగీరథ కోసం 30 పాయింట్లను మనం రిసోర్సులుగా పెట్టుకున్నామని తెలిపారు. ఏ రిసోర్స్ దగ్గర ఏడాదికి ఎన్ని నీళ్లు అవసరమో అంచనా వేసి అందుకు 25 శాతం అదనంగానే నీరు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.
ప్రతీ ఇంటికి ప్రతీ రోజు నిరంతరాయంగా మంచినీటి సరఫరాకోసం.. ఒకసారి మంచి నీరు ఇవ్వడం ప్రారంభమైన తర్వాత ఒక్కరోజు కూడా నీటి సరఫరాను ఆపలేమని చెప్పారు. నీటిపారుదల, మిషన్ భగీరథ అధికారులు సంయుక్త సమావేశం నిర్వహించుకోవాలని సూచించారు. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. వీటిలో 10 శాతం నీటిని మంచినీటికి రిజర్వు చేసుకున్నామని వెల్లడించారు.
కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత శాశ్వత ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది చివరికే నదీ జలాలను గ్రామాలకు అందించాలని సీఎం చెప్పారు. నీటిపారుదల శాఖతో సమన్వయం కోసం మిషన్ భగీరథ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని కేసీఆర్ ఆదేశించారు.