పాలనతో ప్రజల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా మార్చే ప్రయత్నంలో కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయి. దేశవ్యాప్తంగా కేసీఆర్ పథకాలను ప్రవేశపెట్టేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకువస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సంక్షేమంలోనే కాదు ప్రజాదరణలోనూ దేశంలో తొలిస్ధానంలో నిలిచారు కేసీఆర్. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనితీరుకు ప్రజలు జై కొట్టినట్లు సీఓటర్-ఐఏఎన్‌ఎస్ తాజా సర్వే తేల్చింది. పనితీరు విషయంలో దేశంలోని ముఖ్యమంత్రులు అందరి కంటే కేసీఆర్ ముందున్నారు. మొత్తంగా 79.2 శాతం మంది ఆయన పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఈ సర్వే తేల్చింది.
ఈ సర్వే కోసం తెలంగాణలో 20827 మంది అభిప్రాయాలు సేకరించారు. అందులో 68.3 శాతం మంది కేసీఆర్ పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేయగా.. 20.8 శాతం మంది కొంత వరకు సంతృప్తి వ్యక్తం చేశారు.
కేవలం 9 శాతం మంది మాత్రమే ఆయన పనితీరు బాగాలేదని అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ తర్వాతి స్థానంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నారు. పుదుచ్చెరి, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు అట్టడుగున నిలిచారు. తమిళనాడు సీఎం పళనిస్వామి పనితీరుపై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. ఏపీ చంద్రబాబు 14వ స్థానంతో సరిపెట్టుకున్నారు. టాప్ టెన్‌లో కేవలం ఇద్దరు బీజేపీ ముఖ్యమంత్రులు మాత్రమే ఉండటం గమనార్హం.