ఈరోజు గవర్నర్ నరసింహన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టును చూసిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాళేశ్వరం చంద్రశేఖర్‌రావు అని పిలవాలనిపిస్తున్నదని గవర్నర్ తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శించారు. ఆయన వెంట మంత్రి హరీశ్ రావు, ఉన్నతాధికారులు ఉన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్… కాళేశ్వరం ప్రాజెక్ట్ వెనక పెద్ద టీమ్ వర్క్ ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ చాలా గొప్ప ప్రాజెక్ట్ అన్నారు. మరో ఆరు నెలల్లో ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఆశిస్తున్నానన్నారు. ప్యాకేజీ -6లో గోదావరిని అంతర్‌వాహిణిగా తీసుకొచ్చారని గవర్నర్ తెలిపారు. ప్రాజెక్ట్ పనుల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ గవర్నర్ అభినందనలు తెలియజేశారు.
‘ఇప్పటి వరకు మ్యాపుల ద్వారానే కాళేశ్వం ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నా. క్షేత్రస్థాయి పరిశీలనలో పనులు జరుగుతున్న తీరు ఆశ్చర్యానికి గురి చేసింది. జూన్ – జులై వరకు తొలి దశ పనులు పూర్తవుతాయి. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు అభినందనలు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. తాగునీరు కూడా అందుతుంది’ అని గవర్నర్ అన్నారు.