డ్రగ్స్ కేసును చాప చుట్టేస్తున్నారని, పెద్దల ఒత్తిళ్ల మేరకు ప్రభుత్వమే ఆయనను సెలవుపై పంపేస్తోందనే విమర్శలు వస్తుండడంతో సీఎం కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకున్నారు. శనివారం అకున్ సభర్వాల్‌కు నేరుగా ఫోన్ చేసి డ్రగ్స్ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కీలక సమయంలో సెలవుపై వెళ్లడం సరికాదని, దానిని వాయిదా వేసుకోవాలని సూచించారు. కేసును మరింత లోతుగా శోధించాలని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని నిర్దేశించారు. దర్యాప్తు సందర్భంగా సంకోచించాల్సిన అవసరం లేదని, జంకూ గొంకూ అసలే ఉండకూదని స్పష్టం చేశారు. కేసుతో సంబంధం ఉన్నవారు ఎంతటివారైనా భయపడవద్దని ధైర్యం చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌లో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా డ్రగ్స్ కేసుపై సీఎం సమీక్షించినట్లు సమాచారం. డ్రగ్స్ కేసు వివరాలపై ఎక్సైజ్ శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తుంది. తమ విచారణలో వెల్లడైన సమస్త సమాచారాన్నీ అకున్ సబర్వాల్ సీఎం ముందుంచారు. ఇప్పటివరకూ అరెస్ట్ చేసిన వారి నుంచి సేకరించిన సమాచారాన్ని, తమ వద్ద ఉన్న సినీ ప్రముఖుల పేర్లను ఆయన కేసీఆర్ కు వివరించినట్టు తెలుస్తోంది. ఈ కేసు విచారణపై నివేదికను సమర్పించిన ఆయన, తదుపరి ఏం చేయాలన్న విషయమై కేసీఆర్ సలహాను అడిగినట్టు సమాచారం. కేసులో రాజకీయ ఒత్తిళ్లు వస్తే లొంగవద్దని,అవసరం అనుకుంటే పోలీసుల సాయం తీసుకోవాలని కేసీఆర్ స్పష్టంగా చెప్పారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశానికి డీజీపీ అనురాగ్ శర్మ కూడా హాజరయ్యారు.
కెల్విన్ విచారణలో మరికొన్ని వివరాలు తెలిసినట్టు సమాచారం. విచారణ పూర్తి అయిన తరువాత మరో ఆరుగురికి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఈడీ అకున్ సభర్వాల్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ ఆరుగురి పేర్లూ బయటకు వస్తే, తెలుగు సినీ ఇండస్ట్రీ కంపిస్తుందని సిట్ వర్గాలు భావిస్తున్నాయి.