2019లో విజయం మనదే..

187
KCR at pragathi bhavan
KCR at pragathi bhavan
- Advertisement -

2019 ఎన్నికల్లో మళ్లీ అఖండ విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో ఘనవిజయం సాధించటంతోపాటు 17 ఎంపీ సీట్లలో 15 సీట్లను గన్‌షాట్‌గా గెలుచుకుంటామన్నారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు బాగా చేరువవుతున్నాయని.. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో గెలిపించి అధికారం అప్పగించడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమాల అమలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు కీలకపాత్ర పోషించాలని, ప్రభుత్వంలో ఉన్నా, పార్టీలో ఉన్నా ప్రజలతో మరింతగా మమేకమై పనిచేయాలని పిలుపునిచ్చారు. శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై సభ్యత్వ నమోదు, పార్టీ ప్లీనరీ, వార్షికోత్సవ సభపై చర్చించారు. ఈ సందర్భంగా సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను కేసీఆర్ ప్రకటించారు.

ఈ బడ్జెట్‌లో కొత్తగా ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేశాం. దీని స్ఫూర్తిని అర్థం చేసుకొని ప్రజాప్రతినిధులు ఆయా వర్గాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేయాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఖర్చుచేసేటప్పుడు కూడా ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం కార్యక్రమాలుండాలి. బీసీ వర్గాలు, చేతి వృత్తులకు ఆర్థిక చేయూత అందించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదలవుతాయి’’ అని కేసీఆర్‌ చెప్పారు.

టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికల షెడ్యూలును సీఎం కేసీఆర్‌ విడుదల చేశారు. ఏప్రిల్‌ 6న గ్రామ కమిటీలు; 12, 13 తేదీల్లో మండల కమిటీల ఎన్నికలు నిర్వహిస్తారు. 14న రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 18న నామినేషన్ల స్వీకరణ, 20న ఉపసంహరణ, 21న హైదరాబాద్‌లోని కొంపల్లిలో ప్లీనరీ నిర్వహిస్తారు. అధ్యక్షుడి ఎన్నిక జరుపుతారు. 27న వరంగల్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది.

ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. సభ్యత్వాలు, ప్లీనరీ, బహిరంగ సభల నిర్వహణకోసం బాధ్యులను సీఎం ప్రకటించారు. పార్టీ సభ్యత్వ నమోదు, ఎన్నికలు, బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణకు రాష్ట్రస్థాయిలో సీనియర్ నాయకులు పర్యాద కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. ఇక ప్లీనరీతోపాటు బహిరంగ సభలకు సంబంధించి 31 జిల్లాల బాధ్యతలు ఐదుగురికి అప్పగించారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డికి వరంగల్ అర్బన్, రూరల్, ప్రొఫెసర్ జయశంకర్-భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారికి అదిలాబాద్, నిర్మల్, కుమురం భీం-అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న- సిరిసిల్లా, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాల బాధ్యతలు ఇచ్చారు. మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ-గద్వాల్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, యాదాద్రి- భువనగిరి, నల్లగొండ జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌కు నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల బాధ్యతలు అప్పగిస్తే జీహెచ్‌ఎంసీ మేయర్‌బొంతు రామ్మోహన్‌కు హైదరాబాద్ జిల్లా బాధ్యతలు అప్పగించారు.

- Advertisement -