లింగ వివక్షత, మహిళా సాధికారతపై పురుషులకు సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత . తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ ఇండియా ఆధ్వర్యంలో “డెవలపింగ్ ఉమెన్ లీడర్ షిప్ : ఎ రోడ్ మ్యాప్ టు సక్సెస్ “ పై శిక్షణా కార్యక్రమం నిర్వహించగా రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రతినిధుల హాజరయ్యారు.
“డెవలపింగ్ ఉమెన్ లీడర్ షిప్ : ఎ రోడ్ మ్యాప్ టు సక్సెస్ “ అంశంపై తెలంగాణ జాగృతి, యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 5 వ అంశమైన లింగ సమానత్వం తో పాటు అన్ని స్థాయిల్లో మహిళలు భాగస్వామ్యం, నాయకత్వం వహించటంపై ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తారు. ఇంతేకాకుండా కార్యాలయాలు, ఇతర పని ప్రదేశాలలో మహిళలు ఎదుర్కునే లింగ వివక్షతను రూపు మాపడంపై ప్రత్యేకంగా చైతన్యం కలిగిస్తారు. హైదరాబాద్ లోని హయత్ ప్లేస్ లో నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవితతో పాటు యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. భారీగా హాజరైన మహిళా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన మాజీ ఎంపీ కవిత, మహిళలు మరింత ఉన్నత స్థానాలకు ఎదగడంతో పాటు మరికొంత మంది మహిళలకు చేయూతనివ్వడానికి ఏం చెయ్యాలన్న దానిపై రెండు రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమంలో అవగాహన కల్పిస్తామన్నారు. మహిళా సాధికారత, లింగ వివక్షతను కోసం ఉద్దేశించబడిన ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహిస్తున్నందుకు గ్లోబల్ కాంపాక్ట్ నెట్ వర్క్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కమల్ సింగ్ కు మాజీ ఎంపీ కవిత కృతజ్ఞతలు తెలిపారు.
మహిళలు ఇప్పటికే స్వశక్తితో ఎదుగుతున్నారని అయితే మరింత ఉన్నతిని సాధించేందుకు సరైన మార్గంలో అత్యుత్తమంగా అడుగులు వేయడమే ఈ శిక్షణా కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు. విభిన్న వేదికలపై మహిళా సాధికారత గురించి ఎంత మాట్లాడినా, మనవంతుగా ఎంతో కొంత ప్రయత్నం చేసినప్పుడే ఫలితం కనిపిస్తుందన్నారు. ఔత్సాహికులు, ప్రతిభావంతులైన మహిళలను గుర్తించి వారితో పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తున్న గ్లోబల్ కాంపాక్ట్ నెట్ వర్క్ ఇండియా ప్రతినిధులను మాజీ ఎంపీ కవిత అభినందించారు. తమిళనాడు కోయంబత్తూరులో చదువు రాని ఒక ఔత్సాహిక మహిళ సొంతంగా పరిశ్రమ ఏర్పాటు చేసి మరో 50 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా కవిత గుర్తు చేసారు.
మహిళలకు కాస్త విశ్రాంతి తీసుకునే సమయం దొరకడం చాలా కష్టమన్న కవిత…తను ఉదయం నాలుగున్నర గంటలకు నిద్రలేస్తే తప్ప తనకు విశ్రాంతి తీసుకునే సమయం దొరకదన్నారు. సమయానికి ఎదురీదుతూ, తన పిల్లల కోసం తగిన సమయం కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మహిళలు సక్సెస్ అవ్వడం కష్టతరమే అయినా, అసాధ్యం మాత్రం కాదన్నారు. జీవితంలో విజయం సాధించేందుకు కావల్సిన అన్ని అర్హతలు స్త్రీలకు ఉన్నాయన్నారు. ఇక లింగ వివక్షత, మహిళా సాధికారతపై పురుషులకు సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు కవిత. మహిళలకు సరైన అవకాశాలు కల్పించడంపై వివిధ సంస్థలు, కంపెనీలు, రాజకీయ పార్టీలలో ఉన్న పురుషులకు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని కవిత అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత సమాజంలో మహిళలపై విపరీతమైన ఒత్తిడితో పాటు అంచనాలు ఉన్నాయన్నారు మాజీ ఎంపీ కవిత.ఈ రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో పాల్లొన్న తర్వాత మహిళలు తమ అర్హత మేరకు దక్కాల్సిన జీతం, ప్రమోషన్లు కోసం గళం వినిపించడం ప్రారంభిస్తారన్నారు నమ్మకం తనకు ఉందన్నారు కవిత. రెండు రోజుల శిక్షణా కార్యక్రమంలో వీలనంత ఎక్కువగా భాగస్వామ్యం అవుతూ, సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలు సంధించాలని కార్యక్రమానికి హాజరైన మహిళా ప్రతినిధులకు కవిత విజ్ఞప్తి చేసారు. శిక్షణా కార్యక్రమంలో ప్రసంగించేందుకు చాలా మంది మహిళా ప్రతినిధులు హాజరవడం సంతోషంగా ఉందన్న కవిత…రానున్న కాలంలో ప్రస్తుతం హాజరైన మహిళల నుంచే ప్రతినిధులను ఎంపిక చేసే స్థాయికి ఎదగాలన్నారు. మహిళలు తాము పనిచేస్తున్న సంస్థల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.
ఈ సందర్బంగా తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మ పండుగ, మహిళల కోసం చేస్తున్న కృషిని అభినందిస్తూ, మాజీ ఎంపీ కవితను యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ ప్రతినిధులు సన్మానించారు. ఫ్రొఫెసర్ ఆర్ ఆర్ శర్మ, డాక్టర్ శంకర్ గోయంక, ఎంసీ తమన్నా మరియు ఇతర ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రైవెట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన మహిళా ప్రతినిధులు, తెలంగాణ జాగృతి వివిధ జిల్లాల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.