బొగ్గు గనుల ప్రైవేటికరణ….కేంద్రం నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలి

162
kavitha
- Advertisement -

బొగ్గు గనులను ప్రైవేటికరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఇక తెలంగాణలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత ఇచ్చిన పిలుపుమేరకు సింగరేణి వ్యాప్తంగా నిరసన చేపట్టారు కార్మికులు.

బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు వేలం వేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా వేలాదిమంది బొగ్గు గని కార్మికులు సమ్మెలో ఉన్నారని తెలిపారు కవిత. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కవిత … టీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్‌ సైతం సమ్మెలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు కవిత.

మోడీ ప్రభుత్వం బొగ్గు గనుల్నీ ప్రైవేటీకరిస్తుందని టీబీజీకేఎస్ నాయకులు ఆరోపించారు.సహజవనరులపై దేశ ప్రజలకున్న హక్కుల్ని కాలరాసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి ఇరుసులా ఉన్న సింగరేణిని ప్రైవేటుపరం చేసి రాష్ట్రాభివృద్దిని అడ్డుకోవాలన్నదే బీజేపీ కుట్ర అని విరుచుకుపడ్డారు.

కోల్ ఇండియా, సింగరేణిలను దెబ్బతీసేందుకు ప్రైవేటు కంపెనీలు తొలుత తక్కువ ధరలకు బొగ్గును అమ్మే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ సంస్థలు నష్టాల్లోకి వెళ్లనున్నాయి. దీన్ని సాకుగా చూపి కేంద్రం సింగరేణిని శాశ్వతంగా మూసేయించే ప్రమాదం ఉందని సమ్మెలో పాల్గొన్న కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే సింగరేణి కార్మికుల సత్తా చూపిస్తామన్నారు.

- Advertisement -