హేతువాది బాబుగోగినేని, అతని అనుచరులపై దేశద్రోహం, మతవిశ్వాసాలను కించపరచడం తదితర వంటి కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీరు హేతు వాద ప్రచారంతో ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని కెవీ నారాయణ అనే వ్యక్తి, మరికొందరి ఫిర్యాదుతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యాయి.
తాజాగా సినీ విశ్లేషకుడు కత్తి మహేష్, బాబుగోగినేనికి మద్దతుగా నిలిచారు. గోగినేనిపై కేసులు పెట్టడం ఖండిస్తున్నానన్నారు. ఆయనపై కేసు నమోదు చేయడం వెనుక దొంగస్వాములు, దొంగబాబాల హస్తం ఉందని చెప్పారు. మతం మూడనమ్మకాల పేరుతో వ్యాపారం చేస్తున్న వారికి వ్యతిరేకంగా మాట్లాడి.. ప్రజలలో అవగాహన కల్పిస్తున్న గోగినేనిపై కేసు పెట్టడం దారుణమని, ఆయనపై పెట్టిన కేసులు తొలగించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నారని, ఆయన లేని సమయం చూసి కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన బటికి వచ్చిన తరువాత అసలు ఏం జరిగిందనే విషయం తెలుస్తుంది అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రాణాలకు హానీ కలిగే అవకాశం ఉందని, ఆయనకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మరి బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న గోగినేనిపై పోలీసులు యాక్షన్ తీసుకుంటారా..? లేదా చూడాలి.