కార్తీకమాసం విశిష్టత

972
karthika masam
- Advertisement -

కార్తీక మాసమంతా ఆధ్యాత్మికత కనిపిస్తుంది. భక్తజనమంతా మహాశివుడి అనుగ్రహం కోసం పూజల్లో మునిగితేలుతుంటారు. తెల్లవారు జామునే తలారా స్నానం చేసి తదితర కార్యక్రమాలు ముగించి.. శివాలయాలకు తరలివెళ్లి…శివ కరుణకోసం నిష్టగా పూజలు చేస్తారు. ఏ శివాలయం చూసినా భక్తజనంతో కళకళలాడుతోంది. దీపాల వెలుగుతో శోభిల్లుతోంది.

కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడిన రోజుతో ప్రారంభం అవుతున్నందునదీనికి కార్తీకమాసమని పేరొచ్చింది. కార్తీకంలో ఎటు చూసినా దీపమే కనబడుతుంది. కార్తీకమాసంలో శివాలయంలో, విష్ణాలయంలో, అంబికాలయంలో, మఠప్రాంగణంలో ఇలా నాలుగు చోట్లా దీపాన్ని పెడతారు. ఒక్క కార్తీక మాసంలో పెట్టే దీపానికి మాత్రమే కార్తీక దీపం అని పేరు ఉంది.

కార్తీక దీపం వెలిగించడానికి విశిష్ట చరిత్ర ఉంది. సూర్యుడు అంటే.. మహా దీపం.  కార్తీక మాసంలో మనకు అంటే భూమికి కొంత దూరంగా వెళతాడు. సూర్యుడు భూమికి కొంత దూరంగా వెళ్లడం వల్ల ప్రకృతిలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. రోగాలు ప్రబలిపోతాయి. చలి వల్ల వృద్ధులకు, పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది. రక్తంలోని కొవ్వు గుండె కవాటాలలో ఒత్తిడిని సృష్టిస్తాయి. ఈ పరిస్థితుల్లో మానవాళి శ్రేయస్సు కోసం భక్తులు ప్రకృతిలో ప్రభలే విపరీతాలను అడ్డుకుంటూ మానవాళి మొత్తానికి మేలు జరిగేలా మహా సంకల్పంతో ఔషధగుణాలు కలిగిన ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు. ఆ నూనెలో ఉండేటువంటి ఆ ఔషధ గుణాలు అగ్ని ద్వారా ప్రకృతిలోకి ప్రసరించి ఆ ప్రాంతం వారి ఆరోగ్యాలకు కారణం అవుతుంది. అందుకే రోజు ఇంటిలోనే దీపారాధన చేసుకునే వారు కూడా ఈ మాసంలో ఆలయాలకు వచ్చి దీపారాధన చేస్తారు. మిగిలిన సంవత్సరమంతా దీపారాధన చెయ్యకపోయినా ఈ ఒక్క మాసంలో అయినా 360 వత్తులు వెలిగించాలని పురాణాలు చెబుతున్నాయి.

ఎక్కడైతే దీపాలు వెలిగించి ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి కొలువుంటుందని పెద్దలు చెబుతారు.  ఇక ఈ మాసంలో ముఖ్యంగా శివుడికి అభిషేకాలు నిర్వహించడం సంప్రదాయం.శివునికి అలంకారాలు,రాజోపచారాలతో పనిలేదు. భక్తితో చెంబెడు నీళ్లుపోస్తే చాలు శివుడు సంతుష్టుడై కోరిన కోర్కెలను తీరుస్తాడని శివపురాణం చెబుతోంది. కార్తీక సోమవారం.. అందునా ప్రదోషకాలం అభిషేకానికి ఎంతో విశిష్ఠమైనది. ఈ సమయంలో శివుడు..పార్వతీదేవి సమేతుడై అర్ధనారీశ్వర రూపంలో తాండవం ఆడుతుంటాడని పురాణోక్తి. అందువల్ల ప్రదోషకాలంలో శివుడిని ఆరాధించడం కనిపిస్తుంటుంది.ఇక కార్తీక మాసంలో వనభోజనాలకు కూడా ఎంతో ప్రధాన్యత ఉంది.

- Advertisement -