సైనికులను గౌరవించుకోవాలి: మంత్రి కేటీఆర్‌

20
ktr
- Advertisement -

దేశం కోసం సైన్యంలో పనిచేసి అమరులైన వారి కుటుంబాల‌కు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా, ఇత‌ర స‌దుపాయాల‌ను నిలిపివేసి, కేవ‌లం ప్ర‌భుత్వ ఉద్యోగం క‌ల్పిస్తామ‌ని క‌ర్ణాట‌క కేబినెట్ తీసుకున్న నిర్ణ‌యంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించారు. జాతీయ‌వాదం గురించి పెద్ద‌గా మాట్లాడే పార్టీ ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం అవ‌మాన‌క‌ర‌మ‌ని కేటీఆర్ ట్వీట్ చేశారు. సాయుధ ద‌ళాల్లో ప‌ని చేసిన సైనికుల‌ను మ‌నం గౌర‌వించుకోవాలి కానీ ఆర్థిక భారంగా ప‌రిగ‌ణించ‌రాదు అని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకుంటుంద‌ని ఆశిస్తున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా, ఇత‌ర స‌దుపాయాల‌ను నిలిపివేస్తున్న‌ట్లు కర్ణాటక ప్రభుత్వం ప్ర‌క‌టించింది. క‌ర్ణాట‌క కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని మాజీ సైనికులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. న్యాయ‌శాఖ మంత్రి జేసీ మ‌ధుస్వామి మీడియాతో మాట్లాడుతూ.. అమ‌ర‌వీరుల కుటుంబ స‌భ్యుల‌కు ఇచ్చే న‌ష్ట ప‌రిహారం, భూమికి బ‌దులుగా ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు కేబినెట్ నిర్ణ‌యించింద‌ని తెలిపారు.

దీనిపై మాజీ సైనికాధికారి ర‌వి మునిస్వామి మాట్లాడుతూ.. ఇండియాలో చాలా రాష్ట్రాలు ఎలాంటి పరీక్ష‌లు నిర్వ‌హించ‌కుండానే అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగాలు క‌ల్పిస్తున్నాయ‌ని గుర్తు చేశారు. ప్ర‌భుత్వ ఉద్యోగంతో పాటు భూమి, ప‌రిహారం కూడా ఇస్తున్నాయ‌ని తెలిపారు. కానీ క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం మాత్రం అమ‌ర‌వీరుల కుటుంబాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇత‌ర స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఆస‌క్తి చూప‌డం లేద‌ని మునిస్వామి పేర్కొన్నారు.

- Advertisement -