కర్నాటక ఎన్నికలు కాంగ్రెస్ కు ఏ స్థాయిలో బూస్ట్ ఇచ్చాయో తెలియదు గాని, బీజేపీని మాత్రం గట్టిగానే దెబ్బతిశాయి. మరోసారి అధికారంలోకి వచ్చి అదే జోష్ లో సౌత్ రాష్ట్రాలన్నిటిలో గట్టిగా పాతుకుపోవాలని కలలుగన్న బీజేపీ వ్యూహాలు తారుమారయ్యాయి. ఇతర రాష్ట్రాలలో అధికారంలోకి రావడం సంగతి అటుంచితే.. ఉన్న ఒకే ఒక్క సౌత్ రాష్ట్రం కూడా చేజారిపోవడంతో బీజేపీ హైకమాండ్ ఒక్కసారిగా డీలా పడింది. దాంతో నెక్స్ట్ ఏం చేయాలి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపై కాషాయ పార్టీ ఫోకస్ పెట్టనున్నుట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి..
తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని కల్లబొల్లి మాటలు చెప్పే కమలనాథులకు కర్నాటక ఎఫెక్ట్ గట్టిగానే తాకింది. దాంతో ఇప్పుడు అధికారంలోకి రావడం మాట అటుంచి.. రాష్ట్రంలో పార్టీ బలం ఎంతమేర ఉందనేది పునః పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఏపీలో నిన్నమొన్నటి వరకు జనసేనతో మాత్రమే తమ పొత్తు ఉంటుందని, టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన కాషాయదళం.. ఇప్పుడు టీడీపీతో కలవడంపై కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కర్నాటక ఇచ్చిన స్ట్రోక్ తో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల కూడా బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట పడిందనే చెప్పాలి.
Also Read: Pawan:బీజేపీకి “పవన్ సెగ ” !
అయితే ఈ ఏడాది చివర్లో తెలంగాణతో పాటు ఛత్తీస్ గడ్, మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాలలో కూడా స్థానిక పార్టీల ప్రభావం గట్టిగానే ఉంది. మునుపటితో పోలిస్తే కాంగ్రెస్ కూడా ఆ రాష్ట్రాలలో బాగానే బలం పెంచుకుంది. దీంతో ఆ రాష్ట్రాలలో కూడా బీజేపీకి షాక్ తప్పదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఒకవేళ ఆ ఐదు రాష్ట్రాలలో ఏ మాత్రం ఫలితం తేడా కొట్టిన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని భావించక తప్పదు. మొత్తానికి కర్నాటక ఓటమి ప్రభావం బీజేపీపై గట్టిగానే పడిందనే చెప్పాలి.
Also Read: సిఎం పదవి ఇవ్వకపోతే.. డీకే రాజీనామా ?